చివరి లిస్ట్‌తో చిచ్చు.. అనంతపురంలో భగ్గుమన్న అసమ్మతి.. టీడీపీ ఆఫీసుపై దాడి

అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు రెచ్చిపోయారు.

Anantapur Urban TDP: తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు.

అనంతపురం అర్బన్ టికెట్ ఆశించి ప్రభాకర్ చౌదరి భంగపడటంతో ఆయన మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఫ్లెక్సీలు, పాంప్లెట్లు తగలబెట్టారు. అనంతపురం నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు పగులగొట్టి.. ఫర్నీచర్ కంప్యూటర్లను ధ్వంసం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకుండా, డబ్బులు అమ్ముకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రభాకర్ చౌదరి వర్గీయుల ఆందోళనతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

చంద్రబాబు పిలిచినా వెళ్లను: ప్రభాకర్ చౌదరి
తనకు టికెట్ రాకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందని.. డబ్బున్న వారికి మాత్రమే ఇక్కడ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో నడవడం లేదని దుయ్యబట్టారు. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి పని చేశాను. సొంత ఆస్తులు అమ్ముకున్నాను.ఎవరిని అడిగి చంద్రబాబు దగ్గుబాటి ప్రసాద్‌కి టికెట్ ఇచ్చారు.. ఆయన గాంధీ వారసుడా? ఏ ప్రాతిపదికన ఆయనకు టికెట్ ఇచ్చారు?  రేపు నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా. చంద్రబాబు పిలిచినా ఆయన వద్దకు వెళ్ళను. జిల్లాలో ఇంకా చాలామందికి అన్యాయం చేశారని ప్రభాకర్ చౌదరి వాపోయారు.

Also Read: టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా విడుదల.. భీమిలి స్థానం గంటాకే

తెలుగు మహిళల నిరసన
ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో అర్బన్ తెలుగు మహిళలు.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫోటోలు ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి తగలబెట్టారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు చంద్రబాబు ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు