Andhra Pradesh : ఏపీలో ప్రజలు, బిల్డర్లకు భారీ ఊరట.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు కూటమి సర్కార్ కీలక నిర్ణయం
AP Government : వీఎల్‌టీని 50శాతానికి తగ్గించాలని ప్రజలు, బిల్డర్ల నుంచి రిక్వెస్టులు రావడంతోపాటు.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
- Harishth Thanniru
- Published On : February 19, 2026 / 11:54 AM IST
AP Government
- ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం
- వీఎల్‌టీ 50శాతం తగ్గిస్తూ నిర్ణయం
- అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం
- ఏపీలో ప్రజలు, బిల్డర్లకు భారీ ఊరట
Andhra Pradesh : ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలు, బిల్డర్లకు శుభవార్త చెప్పింది. భవన నిర్మాణ సమయంలో వీఎల్‌టీ (భవన నిర్మాణ సమయంలో వసూలు చేస్తున్న ఖాళీ స్థలం పన్ను) 50శాతంకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును ఆమోదించారు.
వీఎల్‌టీని 50శాతానికి తగ్గించాలని ప్రజలు, బిల్డర్ల నుంచి రిక్వెస్టులు రావడంతోపాటు.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీఎల్‌టీని 50శాతానికి తగ్గించడంతో ప్రజలు, బిల్డర్లకు ప్రతీయేటా రూ.30కోట్లు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు మున్సిపల్ శాఖకు ప్రతియేటా రూ.60కోట్లు ఆదాయం వస్తుంది. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు నష్టమైనా ప్రజలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీఎల్‌టీ తగ్గించామని మంత్రి నారాయణ తెలిపారు.
అనుమతులు తీసుకున్న తరువాత ఐదు అంతస్తుల్లోపు భవన నిర్మాణాలు మూడేళ్లలో, ఐదు కంటే మించిన అంతస్థుల భవనాలు ఆరేళ్లలోపు పూర్తి చేయాలి. అలాంటి వాటికే వీఎల్‌టీ తగ్గింపు వర్తించనుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. నిర్మాణ సమయంలో వీఎల్‌టీ 50శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అందరికీ ఆమోదయోగ్యం.. దీని ద్వారా ప్రజలు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది. అయితే, నిర్మాణాలకు అనుమతులిచ్చే సమయంలోనే వీఎల్‌టీ తగ్గింపు వర్తించేలా సాప్ట్‌వేర్‌లోనూ సవరణలు చేయాలని శాసనమండలిలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పేర్కొన్నారు.
వాస్తవానికి వీఎల్‌టీని 50శాతం తగ్గించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. 2019 ఫిబ్రవరి 24న 50శాతం పన్నుకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. కానీ, జీవో అమలుకు ఇబ్బందులు రావడంతో గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో చట్ట సవరణ చేసింది. ఇందుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు త్వరలోనే వెలువడనున్నాయి.
