Cm Chandrababu: రౌడీయిజం చేస్తే వదిలిపెట్టను.. గుడివాడ సభలో సీఎం చంద్రబాబు హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో రౌడీయిజం, క్రిమినల్ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Cm Chandrababu) నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
CM Chandrababu sensational comments about YCP party at Gudivada meeting
- రౌడీయిజం చేస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదు.
- అక్టోబరు కల్లా చెత్త రహిత రాష్ట్రం.
- పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రౌడీయిజం, క్రిమినల్ రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Cm Chandrababu)నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం గుడివాడలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృత్ 2.0 శిలాఫలకాన్ని ఆవిష్కరించి, స్వచ్ఛ అవార్డులను అందజేశారు. గత ప్రభుత్వం కేవలం దోపిడీయే లక్ష్యంగా పనిచేసిందని విమర్శిస్తూ, ప్రజల జీవితాలతో ఆడుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు.
అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత ఏపీ.. ‘తల్లికి వందనం’పై కీలక ప్రకటన:
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యంపై చెత్త ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా చెత్త రహిత రాష్ట్రంగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబం ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ఈ నెలలోనే ‘తల్లికి వందనం’ పథకం నిధులు విడుదల చేస్తామని, ఇందులో అంగన్వాడీ కార్యకర్తలతో పాటు స్వచ్ఛాంధ్ర కార్మికులను కూడా భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు.
2027 మార్చి నాటికి పోలవరం పూర్తి: వ్యవసాయానికి పెద్దపీట:
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి, 2027 మార్చి నాటికి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో పట్టిసీమ ద్వారా 450 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేక ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆక్వా, పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
