విశాఖపై పట్టుపెంచుకోడానికి వైసీపీ ప్రయత్నం.. వారిని కొనసాగిస్తారా, తప్పిస్తారా?

పరిపాలనా రాజధానిగా చేసి వచ్చే ఎన్నికల్లో తన ముద్ర వేయాలని భావిస్తున్న వైసీపీకి.. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.

YCP Focus on Vizag: రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో ప్రక్షాళన చేస్తున్న సీఎం జగన్‌.. విశాఖ జిల్లాపై ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అధికార వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన విశాఖ జిల్లాలో రాజకీయాలు తొలినుంచి ఆ పార్టీకి మింగుడు పడని విధంగానే ఉంటున్నాయి. పరిపాలనా రాజధానిగా చేసి వచ్చే ఎన్నికల్లో తన ముద్ర వేయాలని భావిస్తున్న వైసీపీకి.. క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో జిల్లాలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యామ్నాయం చేసిన సీఎం జగన్‌.. మిగిలిన నియోజకవర్గాలపైనా ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం.. ప్రస్తుతం విశాఖ జిల్లాలో వైసీపీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో ఇప్పుడు చూద్దాం.

ఏపీలోనే ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లా విశాఖ. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఫ్యాన్‌ పార్టీ గాలి వీస్తే.. విశాఖ నగరంలో మాత్రం సైకిల్‌ హవా చూపింది. నగరంలోని నాలుగు నియోజకవర్గాలు గెలుచుకున్న టీడీపీ.. అధికార పార్టీకి గట్టి సవాల్‌ విసిరింది. ఇక స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభావం స్పష్టంగా కనిపించినా.. గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఝలక్‌ ఇచ్చారు ఓటర్లు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్నిస్థానాల్లోనూ గెలుపొందాలని పక్కా స్కెచ్‌ వేస్తోంది వైసీపీ.. ముఖ్యంగా సీఎం జగన్‌ విశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెబుతున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీకి.. వచ్చే ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయడం ద్వారా తమ నిర్ణయానికి ప్రజల ఆమోదం ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్‌. ఐతే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అక్కడ ఎలా ముందుకు వెళతారనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.

ముఖ్యంగా విశాఖ నగరంలో పట్టుపెంచుకోడానికి ప్రయత్నిస్తున్న వైసీపీకి ఇక్కడి పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయని చెబుతున్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు, క్యాడర్‌ రాజీనామాలతోపాటు.. ఎమ్మెల్యే స్థాయి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియాకు ఎక్కుతుండటం చర్చనీయాంశమవుతోంది. తాజాగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి రాజీనామా పార్టీలో గందరగోళానికి గురిచేసింది. తన రాజీనామాపై దేవన్‌రెడ్డి మాట మార్చేసినా.. పార్టీలో కొంత అంతరం ఉందన్న విషయం ఆ ఎపిసోడ్‌తో వెల్లడైంది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి కలగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. ఎన్నికల ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.

వాసుపల్లిని కొనసాగిస్తారా?
ఇక నగరంలోనే మరో కీలక నియోజకవర్గం విశాఖ సౌత్‌. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కు పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆయన పార్టీలో చేరి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్నా.. లోకల్‌గా క్యాడర్‌ మాత్రం ఎమ్మెల్యే వాసుపల్లి నాయకత్వాన్ని అంగీకరించడంలేదు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వాసుపల్లిపై అవినీతి ఆరోపణలు చేస్తూ కార్పొరేటర్‌ సాధిక్‌ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. గతంలో కూడా పార్టీకి చెందిన కార్పొరేటర్‌ కందుల నాగరాజు ఎమ్మెల్యే తీరు నచ్చక రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు గతంలో ఎమ్మెల్సీగా పోటీచేసిన సీతంరాజు సుధాకర్‌.. దక్షిణ నియోజకవర్గంపై కన్నేసి.. ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదేసమయంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొంతమంది వాల్‌పోస్టర్లు ముద్రిస్తూ కలకలం సృష్టిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వాసుపల్లిని కొనసాగిస్తారా? తప్పిస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

తూర్పు నియోజకవర్గంలోనూ లుకలుకలు
ఇదే విధంగా తూర్పు నియోజకవర్గంలోనూ లుకలుకలు కనిపిస్తున్నాయి. టీడీపీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహరిస్తున్నారు. ఆయనను ఓడించాలనే లక్ష్యంతో తూర్పు ఇన్‌చార్జిగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించారు సీఎం జగన్‌. ఆయన కొద్దికాలం క్రితమే ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నా.. ఈ టికెట్‌ ఆశించిన వంశీకృష్ణ యాదవ్‌, విజయనిర్మల సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. వంశీకృష్ణ 2014లోను, విజయనిర్మల 2019లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకోకపోవడంతో టీడీపీ ఈజీగా గెలిచింది. అలాంటిది వచ్చే ఎన్నికలకు ఆ ఇద్దరినీ తప్పించి మూడో వ్యక్తిని తీసుకురావడంతో ఫలితం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఎంపీ ఎంవీవీ తూర్పు నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాల్లో ఇప్పటివరకు ఈ ఇద్దరు నేతలు కనిపించలేదు.

ఆనంద్‌ను వ్యతిరేకిస్తున్న మళ్ల వర్గం
ఇదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇన్‌చార్జిని మార్చారు సీఎం జగన్‌. ఈ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ వ్యవహరిస్తుండగా, రియల్‌ ఎస్టేట్‌ వివాదంలో ఒడిశా పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడంతో.. విశాఖ డైయిరీ నేత అడారి ఆనంద్‌ను పశ్చిమ ఇన్‌చార్జిగా పంపారు సీఎం జగన్‌.. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసిన ఆనంద్‌.. తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు విశాఖ పశ్చిమ ఇన్‌చార్జిగా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మాజీ ఇన్‌చార్జి మళ్ల విజయప్రసాద్‌ అనుచరులు.

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేకే రాజు
ఇక విశాఖలో ఇంకో కీలక నియోజకవర్గం విశాఖ ఉత్తర.. సీనియర్‌ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తరలో గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానంలో గత రెండు ఎన్నికల్లోనూ చేదు ఫలితాలే ఎదుర్కొంది వైసీపీ.. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన కేకే రాజుకు పార్టీలో కొందరు నేతలు హ్యాండ్‌ ఇవ్వడంతో ఓటమి ఎదురైందని ప్రచారం ఉంది. కేకే రాజు గెలవకపోయినా.. ఆయనకు ఎంతో ప్రాధాన్యమిచ్చింది పార్టీ. అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ కొంతమందికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని.. కార్పొరేటర్లకు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కేకే రాజుకు క్యాడర్‌ నుంచి ఎలాంటి సహాయ సహకారం అందుతుందనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read: సీఎం జగన్ కొత్త వ్యూహం ఫలిస్తుందా? మళ్లీ అధికారం దక్కుతుందా?

నగరంలోని నాలుగు నియోజకవర్గాలు.. ఉక్కునగరంలోని గాజువాకలో పరిస్థితులుకన్నా అధ్వానంగా తయారయ్యాయి రూరల్‌ జిల్లాలోని నియోజకవర్గాలు.. విశాఖ పక్కనే ఉన్న భీమిలి నుంచి ఏజెన్సీలోని అరకు వరకు ఎక్కడా పార్టీలో సానుకూల పరిస్థితులు కనిపించకపోడంతో సీరియస్‌గా దృష్టిపెట్టింది అధికార పార్టీ.

గంటా దీటైన అభ్యర్థి కోసం అన్వేషణ
విశాఖ నగరం పక్కనే ఉన్న భీమిలి నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన అభ్యర్థిత్వంపై పార్టీ హైకమాండ్‌ సానుకూలంగా లేదనే ప్రచారం జరుగుతోంది. ఎర్ర మట్టి దిబ్బల్లో తవ్వకాలపై అవంతిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రిగా తప్పించడంతోపాటు, జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఇచ్చినట్లే ఇచ్చి మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించడంతో అవంతిపై అధిష్టానానికి సదాభిప్రాయం లేదనే టాక్‌ నడుస్తోంది. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయనకు దీటైన అభ్యర్థిగా కొత్తవారిని తెరపైకి తెచ్చే అవకాశాలు పరిశీలిస్తోంది వైసీపీ అధి నాయకత్వం.

అదీప్‌రాజును మారుస్తారా?
ఇక విశాఖ నగరానికి అనుకునే ఉండే మరో నియోజకవర్గం పెందుర్తి… సిట్టింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజును ఈ సారి మార్చుతారనే టాక్‌ నడుస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు వల్ల ఈ నియోజకవర్గంలో గట్టిపోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. దీంతో మంత్రి అమర్‌నాథ్‌ లేదంటే ఎమ్మెల్సీ వరుదు కల్యాణిలను ఇక్కడి నుంచి పోటీకి పెట్టాలని వైసీపీ హైకమాండ్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇదేసమయంలో మంత్రి అమర్‌నాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ సత్యవతితోపాటు మాజీ మంత్రి దాడి కుటుంబ సభ్యులు మంత్రిని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. సర్దుబాటులో భాగంగా మంత్రిని అనకాపల్లి నుంచి పెందుర్తి పంపాలనే ప్రతిపాదన సీరియస్‌గా పరిశీలిస్తోంది వైసీపీ.. ఇదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గంలో మండలాల వారీగా నాయకులు విడిపోయారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వద్దు.. వైసీపీ ముద్దు అంటూ అక్కడి కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. ఇదేవిధంగా చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇక ఏజెన్సీ ప్రాంతంలోనూ వైసీపీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తుండటంతో సీరియస్‌గా దృష్టి పెట్టింది పార్టీ నాయకత్వం. ఏజెన్సీలో గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగింది. కానీ ప్రస్తుతం అరుకు, పాడేరు వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వ్యతిరేక ఎదుర్కొంటున్నారు. అరకులో పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి ఎదుటే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడం గతంలో విస్తృత చర్చకు దారితీసింది. ఇదేవిధంగా పాడేరులోనూ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిపై కొందరు సర్పంచ్‌లు, ఎంపీపీలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇలా మొత్తం విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ పరిస్థితులు సానుకూలంగా కనిపించకపోవడం.. గ్రూపులు.. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఎక్కువైపోతుండటంతో పార్టీకి తలనొప్పి ఎక్కువవుతోంది. దీంతో కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాలో మార్పులు చేసినట్లు విశాఖ జిల్లాలోనూ మెజార్టీ నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.

ట్రెండింగ్ వార్తలు