Andhra Pradesh micro Artist
Andhra pradesh Micro Artist : మనం అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంతలా పట్టుచీర తయారు చేసిన చేనేత కళాకారుల్ని చూశాం.టేకు చెక్కలతో ట్రెడ్‌మిల్‌ను తయారు చేసిన కళాకారుడి గురించి విన్నాం.మరి అగ్గిపెట్టే కంటే చిన్న సైజులో ఉన్న మడత మంచాన్ని, కుర్చీలను, డైనింగ్ టేబుల్‌ని ఎప్పుడైనా చూశారా ? మన ఇంట్లో వస్తువులన్నీ ఒక్కసారిగా చిన్నవిగా మారిపోతే ఎలా ఉంటాయో చూడాలని ఉందా..? పదండి ఆ కోనసీమ కళాకారుడి ప్రతిభను, అబ్బురపరిచే అతి చిన్న వస్తువులను చూసేద్దాం…
ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు అగ్గిపెట్టెలో పట్టెంత చిన్నవి. వాలు కుర్చీ, మడత మంచం, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, సోఫా సెట్.. అబ్బో అన్నీ ఇక్కడే ఉన్నాయి. సాధారణంగా ఇవన్నీ అందరి ఇంట్లోనూ ఉండేవే ! కాకపోతే ఈ వాలు కుర్చీలో కూర్చోలేం.. మడత మంచంలో పడుకోలేం.. డైనింగ్ టేబుల్‌పై భోజనం చేయలేం.. ఎందుకంటే ఇవన్నీ అగ్గిపెట్టె కంటే చిన్న సైజులో ఉండేలా తయారు చేశారు. ఇంట్లో డెకరేషన్‌కు ఇవి అద్భుతంగా ఉంటాయి. చూస్తుంటేనే ముచ్చటేస్తుందని కదూ..! వీటి తయారీ వెనుక చాలా కష్టం దాగుంది. సాధారణంగా కార్పెంటర్లు ఉడెన్ కుర్చీలు, మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్స్ తయారు చేస్తుంటారు. ఇందులో వింతేమీ లేదు. కానీ వాటినే అగ్గిపెట్టెలో పట్టేంతలా తయారు చేయమంటే చుక్కల కనిపిస్తాయి. కేవలం కష్టపడితే చాలదు.. దానికి తగ్గ కళాత్మకత కూడా ఉండాలి. అప్పుడే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయి.
ఉప్పులూరి శ్రీనివాసరావు.. ఇతను వృత్తిరీత్యా కార్పెంటర్. ఊరు… కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం. కార్పెంటర్‌గా పాతికేళ్ల అనుభవం ఉంది. అయినా ఏదో లోటు.. ఇంకేదో అసంతృప్తి. కార్పెంటర్లంతా చేసే పనే తాను చేస్తున్నా.. అంతకుమించి వింతేముంది అనే ఆలోచన శ్రీనివాసరావును వెంటాడింది. అందుకే కొత్తగా ఏదో ప్రయత్నించాలని అనుకున్నారు. ఆ ప్రయత్నమే ఇలాంటి అద్భుతాలను సృష్టించేలా చేసింది. తను నేర్చుకున్న కళకు మరింత పదును పెట్టి సూక్ష్మ వస్తువులను తయారు చేస్తున్నారు శ్రీనివాసరావు. గతంలో అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన చేనేత కళాకారులు తయారు చేయడం చూశాం. ఇప్పుడు కార్పెంటర్ శ్రీనివాసరావు అగ్గిపెట్టెలో పట్టేంత సూక్ష్మ వస్తువులను తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
మడత మంచం, మడత కుర్చీని ఒక్క రోజులో తయారుచేయగా, నాలుగు కుర్చీలతో కూడిన డైనింగ్ టేబుల్‌ను తయారు చేసేందుకు మూడు రోజుల సమయం పట్టింది. ఐదేళ్లుగా సూక్ష్మ వస్తువుల తయారీ పైనే శ్రీనివాసరావు ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే బోన్సాయ్ చెట్లపై డెకరేటివ్ వుడ్ వర్క్ ప్రత్యేకంగా చేసి దాన్ని కూడా వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వస్తువులను మరింత సూక్ష్మంగా తయారు చేసి ఏదో ఒకరోజు రికార్డ్ నెలకొల్పడమే ఇతని లక్ష్యం.