opium poppy seeds : గసగసాల సాగు ముసుగులో మాదకద్రవ్యాల పంట..గుట్టు రట్టు చేసిన చిత్తూరు పోలీసులు

chittoor opium poppy seeds cultivation :  చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం మాలేపాడులో… పంటపొలాల మధ్య మాదకద్రవ్యాల పంట పడిస్తున్నారు. అచ్చు గసగసాల వలె కనిపించే మాదక ద్రవ్యాల పంటను సాగు చేయటం కలకలం రేపింది. మామిడితోటలు మధ్యలోని 10 సెంట్ల భూమిలో ఈ మాదక ద్రవ్యాల పంటను పడిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది ఆకస్మిక తనిఖీలు జరపగా… అల్లనేరేడు, మామిడి పంటల మాటునే అంతరపంటగా ఓపియం పాపీ సీడ్స్‌ సాగవుతున్నట్లు గుర్తించారు.

పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ట్రాక్టర్‌తో దున్నేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన గసగసాల పంటను కోయించి తగలబెట్టారు. ఈ సాగు వెనుక ఉన్నది ఎవరు? అనేది తెలుసుకోవటానికి ప్రత్యేక టీముని నియమించారు.

దీంట్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా హస్తం ఉన్నట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా వీరికి మరో ముఠా సహకరిస్తున్నట్లుగా గుర్తించారు. పొరుగునే ఉన్న కోలారు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాల్లో వందలాదిమంది ముంబై, బెంగళూరు డ్రగ్స్ ముఠా ఏజెంట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. పంట చేతికి వచ్చాక స్థానికంగా కొన్ని ఇళ్లల్లో పెద్ద పెద్ద గ్రైండర్లలో ఓపియం పాపీ గింజల్ని పౌడర్ గా మార్చి ఎగుమతి చేస్తున్నారు. ఈ దందా గత ఆరేళ్లనుంచి కొనసాగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.

ఓపియం పాపీ సీడ్స్ అని పిలిచే గసగసాలను…. హెరాయిన్, నల్లమందు లాంటి మాదకద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు. మనదేశంలో ఈ పంటను నిషేధిత జాబితాలో చేర్చారు.
ముంబై, బెంగుళూరుకు చెందిన డ్రగ్స్ ముఠాలు వీరి వెనుక ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సూత్రధారుల వేటలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో జిల్లాలో మరెక్కడైనా ఈ పంటను సాగు చేస్తున్నారా అనే కోణంలో అధికారులు దృష్టి సారించారు. కొన్నేళ్లుగా పుంగనూరు, చౌడేపల్లిలో పెద్దమొత్తంలో బయటపడిన మత్తుమందు పంటల కేసులనూ తిరగేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు