CPS Million March Row : సీపీఎస్ రద్దు విషయంలో ఉపాధ్యాయ సంఘాలు, పోలీసుల మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. సీపీఎస్ రద్దు కోరుతూ రెండు ప్రధాన సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ చేపట్టాలన్న తమ నిర్ణయంలో మార్పు లేదంటూ ప్రకటించారు. సీపీఎస్ రద్దు చేయాల్సిందే అంటూ ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి.
ఉద్యోగ సంఘాల దూకుడుపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. మిలియన్ మార్చ్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. అడుగడుగునా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు.
తాజాగా తిరుపతిలో ఉద్యోగ సంఘ నేతలను అరెస్ట్ చేశారు. ఎంఆర్ పల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. నోటీసులు ఇచ్చి నేతలను విడుదల చేశారు. ముందస్తు అరెస్టులపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వంతో ఉద్యోగులు జరిపిన చర్చలు వరుసగా విఫలమవుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 1న మిలియన్ చేపట్టాలన్న తమ నిర్ణయంలో మార్పు లేదని వారు తాజాగా ప్రకటించారు. మిలియన్ మార్చ్ లో భాగంగా విజయవాడ చేరుకుని అక్కడి నుంచి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలనేది వారి ఆలోచన.
విజయవాడలో మిలియన్ మార్చ్ నిర్వహణ కోసం ఉద్యోగులకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం, ఇతర ఉద్యోగ సంఘాలు విజయవాడలో నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చారని, అయితే ఈ కార్యక్రమాలకు పోలీసుల నుంచి లేదా ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు లేవని స్పష్టం చేశారు.