×
Ad

AP Govt : ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్.. ధాన్యం కొనుగోలులో సమస్యలా..? వెంటనే ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయండి..

AP Govt : రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలతోపాటుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

AP Govt

AP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌లో వరుస తుపానుల ప్రభావంతో సాగుచేసిన పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో మొంథా తుపాను ప్రభావంతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి పంట సాగుచేసిన రైతులకు తీవ్ర నష్టంవాటిల్లింది. తుపాను అనంతరం కొద్దొగొప్పో చేతికొచ్చిన పంటను రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు చేస్తున్నారు. అయితే, కొంతమంది రైతులు కొనుగోళ్లు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలతోపాటుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. కొనుగోలు చేసిన 24గంటల నుంచి 48గంటలలోపు సంబంధిత రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి సుమారు 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రూ.2,830 కోట్ల నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతేకాదు.. రాష్ట్రంలోని ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తామని, ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని, ధాన్యం నిల్వలకు సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, టార్పాలిన్లు ఉచితంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.

Also Read: Wednesday Bank Holiday : బిగ్ అలర్ట్.. డిసెంబర్ 3న బ్యాంకులకు సెలవు.. ఇంతకీ హాలిడే ఎందుకంటే? ఫుల్ డిటెయిల్స్..!

మరోవైపు.. ధాన్యం విక్రయాల సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. విజయవాడ కానూరు పౌరసరఫరాల శాఖ భవనంలో ఈ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహఱ్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్య అయినా రైతులు వెంటనే తెలియజేయడానికి 1967 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ రావడంలో ఆలస్యం, ఆర్ఎస్కే/మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్‌టిఒ పెండింగ్, రవాణా లేదా గోనె సంచుల కొరత,ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై రైతులు 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

అయితే ఈ నంబర్‌కు ఫోన్ చేసేముందు రైతులు కొన్ని వివరాలను దగ్గరలో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. రైతులు తమ ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్,టోకెన్ నెంబర్, గ్రామం పేరు,ఆర్ఎస్కే వివరాలను దగ్గరలో ఉంచుకోవాలని సూచించారు.

రైతులు కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆ ఫిర్యాదును నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపిస్తామని.. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అధికారులు ఫాలోఅప్ చేస్తారని నాదెండ్ల మనోహర్ వివరించారు.