మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన

  • Publish Date - October 18, 2020 / 08:00 AM IST

andhra pradesh heavy rains : తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పలు ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు..మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు.



ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ ప్రభావంతోనే మళ్లీ వర్షాలు పడుతున్నాయని.. వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు.



దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి.



ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.



అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు