AP Latest News : విజయనగరానికి నారా భువనేశ్వరి.. ఈరోజు ఏపీలో ముఖ్యమైన వార్తల వివరాలు ఇలా తెలుసుకోండి ..

నారా భువనేశ్వరి ఈరోజు విజయనగరం వెళ్లనున్నారు. రైలు ప్రమాద బాధితులను ఆమె పరామర్శిస్తారు.

Nara Bhuvaneshwari CM Jagan

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు (మంగళవారం) విజయనగరానికి వెళ్లనున్నారు. రైలు ప్రమాద బాధితులను ఆమె పరామర్శిస్తారు. చంద్రబాబు కేసు విషయంలో సీఐడీ అధికారుల కాల్డ్ డేటా రికార్డ్స్ పై ఏసీబీ కోర్టు ఈరోజు తీర్పును ఇవ్వనుంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 31 Oct 2023 10:10 AM (IST)

    విజయవాడ నగర పాలక సంస్ధ సర్వసభ్య సమావేశం ఈరోజు జరగనుంది. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. బెజవాడ అభివృద్ధి, ఇటీవల టిడ్కో ఇళ్ల లో టీడీపీ నేతల స్కాం, అజెండాలోని 127 అంశాలపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగనుంది.

  • 31 Oct 2023 10:07 AM (IST)

    పోలీసుల అదుపులో దస్తగిరి..

    మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందులలో అదుపులోకి తీసుకుని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.
    ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని యర్రగుంట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

  • 31 Oct 2023 10:04 AM (IST)

    రాజధాని అమరావతి నిర్మాణంకోసం భూములు ఇచ్చిన రైతుల వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లించడంలో ఆలస్యం చేసింది. దీనిపై హైకోర్టులో వేసిన రిట్ పిటీషన్లపై ఈరోజు విచారణ జరగనుంది.

  • 31 Oct 2023 10:03 AM (IST)

    చంద్రబాబుతో ములాఖత్ ..

    ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు నారా లోకేష్, భువనేశ్వరి ములాఖత్ అవుతారు. మరి కాసేపట్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రికి చేరుకుంటారు. ములాఖాత్ అనంతరం రాజమండ్రి నుంచి భువనేశ్వరి విజయనగరం బయలుదేరుతారు. భువనేశ్వరి విజయనగరంలో రైలు ప్రమాద బాధితులను పరామర్శిస్తారు.

  • 31 Oct 2023 09:59 AM (IST)

    విశాఖకు ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రానుంది. వ్యాపార, వాణిజ్య అంశాలపై బ్యాంకర్లు, పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేక సమావేశం ఉంటుంది.

  • 31 Oct 2023 09:57 AM (IST)

    శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం..

    విజయనగరంలో నేడు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం జరగనుంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అమ్మవారికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోకగజపతి రాజు కుటుంబం పట్టువస్త్రాలు సమర్పించింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి సిరిమాను ఊరేగింపు జరగనుంది. ఈ ఊరేగింపును లక్షల మంది భక్తులు వీక్షించనున్నారు. సిరిమాను ఊరేగింపుకు సుమారు రెండువేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 31 Oct 2023 09:53 AM (IST)

    తిరుమల సమాచారం..

    తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. సోమవారం తిరుమల శ్రీవారిని 69,654 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.34 కోట్లు వచ్చింది. నాలుగు కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది.

  • 31 Oct 2023 09:08 AM (IST)

    టీడీపీ - జనసేన నేతల సమన్వయ సమావేశాలు ..

    విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన టీడీపీ, జనసేన నేతల సమన్వయ సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.

    టీడీపీ - జనసేన పర్యవేక్షకులు..

    విశాఖ: నిమ్మల రామానాయుడు, పడాల అరుణ.

    గుంటూరు : షరీఫ్, ముత్తా శశిధర్.

    నెల్లూరు: అమర్నాథ్ రెడ్డి, పితాని బాలకృష్ణ

    కర్నూలు: కాల్వ శ్రీనివాసులు, పెదపూడి విజయ్ కుమార్

  • 31 Oct 2023 08:58 AM (IST)

    విజయనగరానికి నారా భువనేశ్వరి ..

    ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు (మంగళవారం) విజయనగరానికి వెళ్లనున్నారు. రైలు ప్రమాద బాధితులను ఆమె పరామర్శిస్తారు. రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రారంభమవుతుంది. నవంబర్ 1న ఆముదాల వలస, 2వ తేదీన ఎచ్చెర్ల, బొబ్బిలి, 3న విజయనగరంలలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.

  • 31 Oct 2023 08:54 AM (IST)

    చంద్రబాబు ఏసీబీ కోర్టు కేసు అప్డేట్..

    మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కేసు విషయంలో.. ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారుల కాల్డ్ డేటా రికార్డ్స్ పై ఏసీబీ కోర్టు తీర్పును ఇవ్వనుంది. ఇప్పటికే ఈ అంశంపై కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు.. ఈరోజు కాల్ డేటా రికార్డ్స్ పై తీర్పు ఇవ్వనుంది. మరోవైపు చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఇంకో కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు ఈ కేసును నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 ఐఎస్ నరేష్, A2 కొల్లు రవీంద్ర , A3 గా చంద్రబాబును సీఐడీ అధికారులు చేర్చారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు తెలిపిన సిఐడి అధికారులు.. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై ఏసీబీ కోర్టులో ఈరోజు విచారణ కు వచ్చే అవకాశం ఉంది.