Google: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌తో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖపట్టణంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుతో ఇది సాధ్యమైందని, తాను చూసిన ప్రధాన మంత్రుల్లో మోదీ ప్రత్యేకమన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని, విశాఖపట్టణంకు గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని, పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
విశాఖపట్టణంలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్, గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఉపయోగపడనుంది.
ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్టణం ఏఐ సిటీగా మారనుంది. ఈ డేటా సెంటర్ ద్వారా భారత్ లో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ ను గూగుల్ సంస్థ వేగవంతం చేయనుంది.