Social Media Post Case : రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిలపై మరో ఫిర్యాదు..

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ..

Social Media Post Case : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డిలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరిపైన మరో ఫిర్యాదు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేశ్ లను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారిని గుర్తించి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపైన అసభ్య పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపైన టీడీపీ నేత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్కడి పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. రాంగోపాల్ వర్మపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేము అని కోర్టు స్పష్టం చేసింది.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితలపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, పోసాని, శ్రీరెడ్డితో పాటు యాంకర్ శ్యామల మీద కూడా ఫిర్యాదు చేశారు ఐటీడీపీ నేత చంద్రమోహన్. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ రామక్రిష్ణ కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్.. ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డి సహా పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది. త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.

Also Read : మూడు నాలుగు రోజుల్లో బ్లాస్టింగ్‌ న్యూస్ రాబోతుందా? వైసీపీ కీలక నేతలను వెంటాడుతున్న అరెస్టుల టెన్షన్..