Perni Nani
Perni Nani: వైసీపీ నేత, మాజీమంత్రి పేర్నినానిపై మరో కేసు నమోదైంది. పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు ఫైల్ అయ్యింది. ఇటీవల దెందులూరు పర్యటనలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్వామిభక్తితో పని చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు సరిచేస్తామని పేర్నినాని హెచ్చరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.
ఆగస్ట్ 22న వైసీపీ నాయకులు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి పోలీస్ అధికారులను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ”పోలీసులు మీరు తప్పుకోండి. జరిగేది జరుగుతుంది. మేము మిగులుతామా వాళ్లు మిగులుతారా ఎవరో ఒకరు మిగులుతారు” అనే విధంగా ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని.. టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇచ్చారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా మాట్లాడారని, అదే విధంగా పోలీసుల పట్ల అవమానకరమైన సంకేతాలు చూపుతూ, కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైందని చిత్రీకరిస్తూ, ప్రజల్లో అపోహలు కలిగించే రీతిలో మాట్లాడారని పోలీసులు కేసు నమోదు చేశారు.
పేర్ని నాని ఎక్కడి నుండో వచ్చి ఏలూరు పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ప్రసంగించారని కేసు నమోదైంది.
Also Read: ఆమె అవినీతిలో అనకొండ, తాటకి, ఆధునిక రజియా సుల్తాన్..! ఐఏఎస్ అధికారిణిపై భూమన సంచలన వ్యాఖ్యలు