Ayyanna Patrudu YSR: సాయం చేయడంలో YS రాజశేఖర్ రెడ్డిని మించిన వారు లేరు: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసల వర్షం కురిపించారు. సాయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నారు.
ap speaker ayyanna patrudu praises ys rajashekar reddy helping nature at chitchat with media
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశంసలు కురిపించారు. సాయం చేయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించిన వారు లేరన్నారు. అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సహాయం చేయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించిన వారు లేరు. నా స్నేహితుడి కుమారుడికి సీఎంఆర్ఎఫ్ అవసరమైతే వెంటనే మంజూరు చేశారు. ఇప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడ ఉంది? వేరే పార్టీలైనా వైఎస్, నేను చాలా స్నేహంగా ఉండేవాళ్లం. సెషన్ సెషన్‌కు సబ్జెక్టు మారుతుంది. రఫ్ సబ్జెక్టు ఉన్నప్పుడు రఫ్ గా ఉంటాము, స్మూత్ సబ్జెక్టు ఉన్నప్పుడు స్మూత్ గా ఉంటాము” అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ.. “సభ ఏకపక్షంగానే జరుగుతోంది.. వారిని రమ్మని చెప్పాము. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే చూసేవారికి రంజుగా ఉంటుంది. ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలి? ఒక ఎంప్లాయి ఉద్యోగానికి రాకపోతే నోటీసు ఇస్తారు.. సస్పెండ్ చేస్తారు.. జీతం కట్ చేస్తారు.. తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకుంటున్నారు?” అని ప్రశ్నించారు.
“65 రోజులు సభకు రాకపోతే నోటీసు ఇస్తాము. జగన్ జీతం తీసుకోవట్లేదు అన్నది వాస్తవం. మిగిలిన ఎమ్మెల్యేలు కరెక్టుగానే జీతం తీసుకుంటున్నారు.. కానీ సభకు రావడం లేదు. వారిపై నేరుగా నేను చర్యలు తీసుకోవడానికి వీలు లేదు, పార్లమెంటుకు పంపించాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్లు మళ్లీ కోర్టుకు వెళ్తారు. నన్ను కోర్టుకు పిలిచే అధికారం లేదు కానీ, రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది. గవర్నర్ ప్రసంగానికి అటెండెన్స్ పరిగణనలోకి రాదు. నాకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే పార్లమెంట్ స్పీకర్ సలహాలు తీసుకుంటాను. అందులో తప్పేమీ లేదు” అని చెప్పుకొచ్చారు.
“ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం నాకు ఉందా? అప్పట్లో ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదని జగన్ చెప్పాడు. అప్పటి విషయం జగన్‌కు గుర్తు లేదా? ఇప్పుడు దేవుడు 11 సీట్లు ఇచ్చాడు. ఒక మాజీ సీఎం అయినంత మాత్రానా.. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, సీఎంకి మాట్లాడేందుకు ఇచ్చినంత సమయాన్ని నాకు ఇవ్వండి అంటే కుదరదు” అన్నారు.
రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. “అప్పట్లో పార్టీలు వేరైనా జగన్ వాళ్ల నాన్న, నేను మంచి స్నేహితులం. రామానాయుడు స్టూడియో ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు ‘అయ్యన్న ఇలా స్టేజిపైకి రా’ అని వైఎస్సార్ నాకు గౌరవం ఇచ్చారు. ‘పార్టీలది ఏముందిలే’ అని సరదాగా రమ్మని పిలిచేవారు. అప్పుడు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది.. రాను రాను విరోధం పెరిగిపోతోంది. ప్రస్తుతం జనరేషన్ అలా లేదు. పెద్దల సభ అంటే పెద్ద ఆలోచనలతో ఉండేవారు. త్వరలో అసెంబ్లీ పర్మనెంట్ మీడియా అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.
