న్యాయం చేయకపోతే ఆత్మహత్యే.. అబ్దుల్ సలాం ఘటన మరువక ముందే.. కర్నూలు జిల్లాలో మరో సెల్ఫీ వీడియో కలకలం

  • Publish Date - November 11, 2020 / 12:34 PM IST

selfie video kurnool: కర్నూలు జిల్లాలో సెల్ఫీ వీడియోలు కలకలం రేపుతున్నాయి. తనను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకొని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్‌ సలాం ఘటన మరవక ముందే… జిల్లాలో మరో వీడియో తెరపైకి వచ్చింది.. ఓ ఎమ్మెల్యే తమను వేధిస్తున్నాడంటూ సూరజ్‌ అనే కాంట్రాక్టర్‌ ఓ సెల్ఫీ వీడియో తీశారు. ఓ ఎమ్మెల్యే వల్ల తమ కుటుంబం రోడ్డున పడుతుందని.. తమకు న్యాయం చెయ్యకుంటే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు నెలల క్రితం ఎలక్ట్రికల్ కాంట్రాక్టుకు సూరజ్ అనే కాంట్రాక్టర్ టెండర్ వేసి దక్కించుకున్నాడు. అయితే అలాట్‌మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయకుండానే ఒంగోలుకు చెందిన మరోకరికి ఎమ్మెల్యే.. కాంట్రాక్టు ఇప్పించారని సూరజ్ ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా.. దానిని పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.



సీఎం జగనే ఆదుకోవాలని విజ్ఞప్తి:
కర్నూలు జిల్లా నంద్యాలలో మరో ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. లక్ష్మీదేవి అనే మహిళా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఆత్మహత్యాయత్నం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఓ స్థల వివాదమే పరిస్థితిని ఇక్కడికి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ స్థలం అన్యాయంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని… ఇప్పుడు తమ స్థలం విక్రయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు.
https://10tv.in/lovers-suicide-at-nagarkurnool-district/
స్థల వివాదంలో ఎమ్మెల్యే కొడుకు వేధిస్తున్నాడని బాధితులు వాపోయారు. వివాదం కోర్టులో ఉన్నా ఎమ్మెల్యే కొడుకు జోక్యం చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగనే తమను ఆదుకోవాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. లేదంటే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామన్నారు.

లక్ష్మీదేవి ఆత్మహత్యాయత్నానికి ఓ ఎమ్మెల్యే కుమారుడు కారణమని బాధితురాలి కూతురు ఆరోపించారు. తమ భూమిని కాజేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని.. మహిళలం అన్న కనికరం లేకుండా ప్రతి రోజు తమను టెన్షన్‌ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ స్థలం కాజేయడానికి తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసిందని రోపించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమపై ప్రతీకారం తీర్చుకున్నట్టు వ్యవహరిస్తున్నారని.. ఇది సరికాదన్నారు లక్ష్మీదేవి కూతురు. ఆ భూమిని ఎవరికీ విక్రయించకుండా అడ్డుకుంటున్నారని.. ఈ విషయంలో తమకు సీఎం జగన్‌ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లేదంటే.. కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.