CM Chandrababu Naidu
CM Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈసారి సమ్‌థింగ్ స్పెషల్‌గా జరిగాయి. అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర పోషించింది. వైసీపీ సభకు డుమ్మా కొడుతుండటంతో..కూటమి ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ప్రస్తావిస్తూ హైలెట్ అవుతూ వచ్చారు. కట్ చేస్తే అసలు సమస్యలు వదిలేసి..సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా పర్సనల్ ఎజెండాతో పలువురు ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ రాజకీయ వేడిని రాజేశాయి.
అలా లేనిపోని అంశాలను ప్రస్తావించి చర్చకు దారి తీసిన పలువురు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదాదా అంటూ ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్‌రెడ్డి, కూన రవికుమార్‌తో పాటు బోండా ఉమా వంటి వారి తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
సభ వాయిదా పడ్డాక తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బొజ్జల సుధీర్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని కంట్రోల్ చేయాలి కదా అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్‌ను కూడా ప్రశ్నించారట సీఎం.
Also Read: ఈ టీమ్‌లో ఏ ఒక్కరు తప్పు చేసినా… నష్టం వచ్చేలా చేసినా అంతే..: చంద్రబాబు
శాంతిభద్రతల అంశంపై చర్చ జరిగితే బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడటం ఏంటని మందలించారట. లా ఆండ్ ఆర్డర్‌ను మెయింటెన్ చేయడం ప్రభుత్వానికి చేతగాదన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు మాట్లాడటం కూడా చంద్రబాబుకు కోపం తెప్పించిందట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇష్యూలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.
గీత దాటి మాట్లాడటం ఏంటని మండిపడ్డారట. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సింది పోయి వ్యక్తిగత ఎజెండాలేంటని గట్టిగానే మందలించినట్లు టాక్ వినిపిస్తోంది. ఓ సీఐ బదిలీ గురించి సుధీర్‌రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా మాట్లాడటమేంటనీ నిలదీసిన్నట్లు సమాచారం. అధికార పార్టీ సభ్యులనుకుంటున్నారా, ప్రతిపక్ష సభ్యులనుకుంటున్నారా అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారట. టీడీపీ శాసనసభాపక్ష సమావేశం పెట్టాలని, సభ్యులకు అక్కడే గట్టిగా చెబుతానని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.
తాను సభలో లేనప్పుడు ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ తన దగ్గర ఉన్నాయని సీఎం స్పష్టం చేశారట. ప్రతిపక్షం సభలో లేదనీ మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారట చంద్రబాబు. ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారట. అధికారంలో ఉండి తప్పులు చేస్తే పార్టీ మళ్లీ కోలుకోదని తేల్చిచెప్పారట. పార్టీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ ముఖ్యమని, గీత దాటితే సహించేది లేదని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు..సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని తన్నాలన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని సీఎం సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోషల్ మీడియా పోస్టుల విషయంలో హోంశాఖ తీరు సరిగా లేదంటూ తప్పుపట్టారట. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సీనియర్లు కూడా ఇలా మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారట. ఇక పెద్ద దుమారం లేపిన కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సభలో సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నారని..మిగిలిన ఎమ్మెల్యేలు వారిని చూసి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని సీఎం సూచించారట.