Site icon 10TV Telugu

నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉంటుందా? ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు..225కు పెరగడం పక్కానా?

AP Assembly Session 2025

ఏపీలో 175 సీట్లు. తెలంగాణలో 119 సీట్లు. ఒక్కో నియోజకవర్గంలో..ఒక్కో పార్టీలో ఒక్క టికెట్‌ కోసం పదుల సంఖ్యలో ఆశావహులు. ఒకరికి టికెట్ ఇస్తే మరొకరికి బాధ. టికెట్‌ దక్కని నేతల అసంతృప్తి రాగంతో సైలెంట్ అవడం..లేకపోతే జంపింగ్ బాట పట్టడం కామన్ అయిపోయింది. ఇలా ఎందరో ఆశావహులు, కొత్తతరం నేతలు నియోజకవర్గాల పునర్విభజన కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ పున‌ర్విభ‌జన ఇప్పట్లో కుదరదని చెప్పింది సుప్రీంకోర్టు.

జ‌మ్మూక‌శ్మీర్‌ను విభ‌జించి..నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏర్పాటు చేశార‌ని..అదే తరహా విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజ‌క‌వ‌ర్గాల‌ పున‌ర్విభ‌జ‌న చేయాల‌న్న పిటిషన్‌పై ఈ మధ్యే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని 26 సెక్షన్‌ను స‌మ‌ర్థిస్తూనే..ఇప్పటికిప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న సాధ్యం కాద‌ంటోంది. 2026లో జ‌నాభా లెక్కలు చేయ‌నున్నార‌ని..అప్పటివ‌రకు వెయిట్ చేయాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం.

Also Read: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు
ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాత్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆశాభావంతో ఉన్నారు. 2027 కల్లా నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నారు. 175 నుంచి 225కు సీట్లు పెరిగే అవకాశం ఉంది..హామీ ఇచ్చాం..అదే జరుగుతుందనేది తన అభిప్రాయం అంటున్నారు పీవీఎన్‌ మాధవ్‌. అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కాస్త స్తబ్ధత ఏర్పడింది. అయితే 2026లో జనగణన అయిపోతే 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు.

కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పెద్ద విషయమేమి కాదు. ఈ ఉద్దేశంతోనే పీవీఎన్ మాధవ్ నియోజకవర్గాల స్థానాల సంఖ్య పెరుగొచ్చని ఉంటారు. అయితే మాధవ్ వ్యాఖ్యల వెనుక పొలిటికల్ ఎజెండా కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటోంది. సిట్టింగ్ సీట్లు కాకుండా అసెంబ్లీ సీట్లు పెరిగితే కొత్త నేతలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బీజేపీలో చేరేందుకు నేతలు ఉత్సాహం చూపించొచ్చు. అలా పార్టీని బలపడేలా చేయడంతో పాటు కూటమిగా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనేది మాధవ్ వ్యూహం కావొచ్చు.

కొత్తగా 50 వరకు నియోజకవర్గాలు
దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారని..50 వరకు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడతాయని రాజకీయ పార్టీలు ఆశ‌పెట్టుకున్నాయి. అయితే జమిలి ఎన్నికలకు వెళ్తే నియోజకవర్గాల పునర్విభజన 2029లోపు జరగకపోవచ్చంటున్నారు. మామూలుగా షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు వెళ్తే రీఆర్గనైజేషన్‌కు టైమ్ ఉంటుందన్న లెక్కలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఏపీలోని కూటమి పార్టీల్లో టికెట్ ఫైట్ తీవ్రంగా ఉంది.

గత ఎన్నికల్లో జనసేనకు 21, బీజేపీకి 15 సీట్ల దాకా ఇవ్వడంతో టీడీపీ నుంచి చాలామంది సీనియర్ నేతలు రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది, ఇది అసంతృప్తికి దారి తీసింది. అలాగే జనసేన, బీజేపీలో కూడా చాలామంది టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరందరూ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపై హోప్స్‌ పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పున‌ర్విభజన జరిగితే ఆశావహులు కొంతలో కొంతైనా మేలు జరుగుతుంది.

ఒకవేళ సీట్ల సంఖ్య పెరగకపోతే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి జనసేనకు 40 సీట్లు ఇచ్చినా బీజేపీకి మరో 15 సీట్లు ఇచ్చినా ఈ సారి టీడీపీకి ఇంకా కోతపడటం ఖాయం. మరి కొందరు నేతలను తప్పించాల్సి ఉంటుంది. దీంతో కూటమికి నియోజకవర్గాల పునర్విభజన చాలా అవసరం. పైగా సీట్ల సంఖ్య పెరిగితే కూటమికి అడ్వాంటేజ్‌గా మారొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కేంద్రం నిర్ణయం ఎలా ఉండబోతుందో..అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయో లేదో చూడాలి మరి.

Exit mobile version