ఏపీలో జెండా పాతాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అందుకోసం అన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంది. రాష్ట్రానికి వివిధ పథకాల కింద నిధులూ ఇస్తోంది. పథకాలను కూడా అమలు చేస్తోంది. ఇంత చేసినా ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్లటంలో మాత్రం విఫలమవుతోంది. కేంద్రం పథకాలనే పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని అరిచి గీ పెడుతోంది. ఇంత చేసినా రాష్ట్రంలో పార్టీ పరంగా ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే దిక్కులు చూడాల్సిందే.
ఆ పథకాలు మావే అని గట్టిగా చెప్పుకోలేని దుస్థితి:
కేంద్రంలో అధికారంలో ఉండడం.. రాష్ట్రంలో చతికిలపడడం.. ప్రజల్లో సింపతీ కోసం ఎన్ని స్కెచ్‌లు వేయాలో అన్నీ వేయడం.. తీరా ప్రజాదరణ మాత్రం పొందలేకపోవడం ఏపీలో బీజేపీకి అలవాటైన తంతుగా మారింది. కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి కొన్ని పథకాలు తెస్తున్నా అవి మావే అని గట్టిగా చెప్పుకోలేని పరిస్ధితి. రాష్ట్రంలో అమలయ్యే పథకాలలో కొన్ని సెంట్రల్ నుంచి వస్తాయి. వాటిలో కొన్ని పథకాలలో 30శాతం కేంద్రం వాటా ఉంటే 70 శాతం రాష్ట్రం నుంచి ఉంటుంది. మరికొన్నింటిలో కేంద్రం వాటా 70 శాతం, రాష్ట్రం వాటా 30 శాతం ఉంటుంది.
అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు వారి పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకోవడం నిత్యం జరిగేదే. కానీ, కేంద్రం ఇచ్చే పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వంశపారంపర్య పేర్లు పెట్టుకుని తాము ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం బీజేపీ నేతల అసంతృప్తికి కారణమవుతోంది. అంతే కాదు.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన ధోరణినే ఇప్పుడు వైసీపీ కూడా ఫాలో అవుతోందని బీజేపీ నేతలు గొంతు చించుకుంటున్నా ప్రజల్లోకి మాత్రం అది బలంగా వెళ్లడం లేదని అంటున్నారు.
ఆంధ్ర సీఎం స్టిక్కర్ సీఎం:
కేంద్రం ఇస్తున్న పథకాలలో ఒక్క పీఎం కిసాన్ పథకం గురించి తప్ప మిగిలిన వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన సందర్భం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా వీధి వ్యాపారుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం స్వానిధి పథకాన్ని జగనన్న తోడు పేరుతో ఏపీ ప్రభుత్వం తన పథకంగా చెప్పుకోవడాన్ని బీజేపీ నేతలు తప్పపడుతున్నారు. ఈ పథకం కింద వచ్చే నిధులు, లబ్ధిదారులకు ఇచ్చే పది వేల రూపాయలు పూర్తిగా కేంద్రం నుంచి ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ పేరు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర సీఎం స్టిక్కర్ సీఎంగా మారిపోతున్నారని అంటున్నారు.
జగన్ ప్రభుత్వానికి బీజేపీ కొత్త కండీషన్:
ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన ప్రకటనలు జారీ చేసేటప్పుడు దానిపై ప్రధాన మంత్రి మోదీ ఫొటోతో పాటు కేంద్ర ప్రభుత్వ లోగో తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అలా జరగకపోతే ఆ పథకానికి పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, పథకాలు ప్రారంభించే సమయంలో వివిధ మంత్రిత్వ శాఖలు పథకాలకు సంబంధించిన వాటిలో కేంద్ర సహాయం ఎంతో ప్రకటన రూపంలో ప్రజలకు తెలపాలని బీజేపీ షరతు పెట్టింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి చేసిన మాయలు చాలని ఇక నుంచి అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని బీజేపీ నేతలు ఖరాఖండీగా తెగేసి చెబుతున్నారు.
బీజేపీ కండీషన్స్ ను జగన్ పాటిస్తారా?
గతంలో టీడీపీ హయంలోనూ ఇదే జరిగింది. అప్పుడు కూడా బీజేపీ ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒరిగేదేమీ లేకుండా పోయింది. ఈ విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగే నెట్‌వర్క్ బీజేపీకి లేదు. అంటే కింది స్థాయిలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లేకపోవడంతో నేతలు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అయినా బీజేపీ నేతలు పెట్టే కండిషన్స్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొనే చాన్స్ లేనట్టుగానే కనిపిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో బీజేపీ పెట్టిన నిబంధనల్ని వైసీపీ ప్రభుత్వం పాటిస్తుందా? లేక టీడీపీ ప్రభుత్వంలాగే పట్టించుకోకుండా ముందుకెళ్తుందా వేచిచూడాలని పొలిటికల్ వర్గాలు అంటున్నాయి.