Daggubati Purandeswari : కేంద్రం ఇచ్చిన ఆ కోట్ల రూపాయలు ఏమయ్యాయి? సీఎం జగన్‌ను ప్రశ్నించిన పురంధేశ్వరి

Purandeswari Questions CM Jagan : రోడ్లు బాగోలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేసిందో జగన్ చెప్పాలి.

Daggubati Purandeswari Questions CM Jagan (Photo : Facebook)

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తీవ్ర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రం కోసం కేంద్రం కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని, ఆ డబ్బులన్నీ ఏమయ్యాయో సీఎం జగన్ చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని పురంధేశ్వరి విరుచుకుపడ్డారు. ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు. యధేచ్చగా మద్యం దోపిడీ జరుగుతోందన్నారు.

వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు..
శ్రీకాకుళంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ”మోదీ ఆధ్వర్యంలో అవినీతి లేకుండా, కుటుంబ పాలన లేకుండా సుపరిపాలన అందిస్తున్న పార్టీ బీజేపీ. ఏపీ ఏర్పడిన తర్వాత సంపూర్ణ సహకారాన్ని బీజేపీ అందించింది. అభివృద్దిలో అగ్రగామిగా ఉండేలా పలు విధాలుగా సహకారాన్ని అందించాం. కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం.. శ్రీకాకుళం జిల్లాకు, రాష్ట్రానికి ఏం చేసిందో జగన్ చెప్పాలి.

Also Read : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

ఆ డబ్బులు ఎక్కడ జగన్?
శ్రీకాకుళం జిల్లాలో నీటి సమస్య ఉంది. వంశధార, మహేంద్రతనయ తోటపల్లి పనులు వేగవంతంగా చేస్తామని చెప్పి అసలు పట్టించుకోలేదు. ప్రమాణాలతో కూడిన విద్య లేదు. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళంలో ఎస్.ఎస్.ఎ. కింద ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి? ఆర్‌ అండ్ బీ రోడ్ల కోసం రూ.83 కోట్లు కేటాయించింది కేంద్రం. ఆ డబ్బులు ఏమయ్యాయి? కేంద్రం రూ.40 కోట్ల నిధులు ఇచ్చింది. అవి ఏమయ్యాయి? ఇక్కడ పునరావాసం కోసం రూ.19కోట్లు కేటాయించామని సీఎం జగన్ అన్నారు. ఆ నిధులు ఎక్కడ?

రోడ్లు బాగోలేక ప్రాణాలు పోతున్నాయి..
రోడ్లు బాగోలేకపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. అమృత పథకం కింద 9వేల 295 తాగునీటి కుళాయిల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. 5.43 కోట్ల రూపాయలతో మూడు పార్కులు అభివృద్ది కోసం నిధులు ఇచ్చింది. ప్రధానమంత్రి అవాస్‌ యోజన కింద లక్షకు పైగా ఇళ్లను కేటాయించాం. జిల్లాలో లక్ష 8వేల ఇళ్లు కేటాయించస్తే ఎన్ని ఇళ్లు మీరు నిర్మించారు? రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 30వేలు ఇళ్లు నిర్మించే వారికి ఇవ్వాలి. కానీ ఎవరికీ ఇవ్వలేదు.

వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశాం..
పలాసలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 50 పడకల ఆసుపత్రిని కేంద్ర నిధులతో నిర్మించాం. రాష్ట్రం అవినీతిమయంగా మారింది. మరోపక్క ఇసుక మాఫియా ఆగడాలు హెచ్చుమీరాయి. మద్యం దోపిడీ జరుగుతుంది. తెలంగాణలో మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. దీనిపై మా అధినాయకత్వానికి ఫిర్యాదు చేశాము” అని పురంధేశ్వరి అన్నారు.

Also Read : నేను ఏ తప్పూ చేయలేదు,నన్ను నమ్మండి .. మత్స్యకారుల కోసమే వీడియో తీసి పోస్ట్ చేశాను : లోకల్ బాయ్ నాని

ట్రెండింగ్ వార్తలు