AP Assembly Budget Session : అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు.. సస్పెండ్ చేసిన స్పీకర్

ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ దానిని తిరస్కరించారు.

AP Assembly

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం రెండోరోజు కొనసాగుతున్నాయి. అయితే, అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సర్పంచ్ లు అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్ లు చేరుకున్నారు. కొందరు సర్పంచ్ లను వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తమ కార్లలో తీసుకొచ్చి అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లను తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్ లు చేరుకోగలిగారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కార్లలో వచ్చిన మరికొందరు సర్పంచ్ లను అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ ఆవరణం ఎదుట నినాదాలు చేస్తున్న సర్పంచ్ లను పోలీసులు ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ క్రమంలో పలువురి సర్పంచ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. సర్పంచ్ లను బలవంతంగా అదుపులోకి తీసుకని వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.

Also Read : ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌..! రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం

మరోవైపు ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను జగన్ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. స్పీకర్ దానిని తిరస్కరించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దానిని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పేపర్లు చింపి స్పీకర్ పోడియం పై విసిరేశారు. బాదుడే బాదుడు అంటూ టీడీపీ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

Also Read : ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్‌..! రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం

టీడీపీ సభ్యుల తీరును మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. స్పీకర్ పై పేపర్లు చింపి వేయడం ఆయన్ను అవమానించడమేనని అన్నారు. గౌరవమైన స్పీకర్ పై పేపర్లు చించి వేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. మమ్మల్ని అనవసరంగా రెచ్చొగొట్టే పనులు చేయవద్దు.. ఇష్టం లేకపోతే బయటికి పోండి.. లేదా మార్షల్ వచ్చి బయటకు నెట్టేస్తారని అంబటి హెచ్చరించారు. అనంతరం 15 నిమిషాలపాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాతకూడా వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. పలువురు టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఈలలు వేస్తూ నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి స్పీకర్ పోడియం వైపు వేశారు. దీంతో టీడీపీ సభ్యులందరినీ ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని  ప్రకటించారు. అయితే, సస్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో వెంటనే వెళ్లాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను బయటకు పంపించేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ఈలలు వేసుకుంటూనే బయటకు వచ్చారు.