ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరోసారి సమావేశం కాబోతోంది. మూడు రాజధానుల ప్రకటన, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతం జరుగుతున్న ఈ కేబినెట్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2020, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించనున్నారు.
ఉదయం 11గంటలకు సెక్రటేరియట్‌లో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. ప్రతీనెలా రెండో, నాలుగో బుధవారాల్లో కేబినెట్ సమావేశం అవుతోంది. కానీ ఈసారి మాత్రం గురువారం సమావేశం అవుతుండడం గమనార్హం. మూడు రాజధానుల ప్రక్రియకు అడుగులు పడడంతో .. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. హైకోర్టు అభ్యంతరాలు, తరలింపు , విధి విధానాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.
సీఎం జగన్ రానున్న ఉగాది నుంచే విశాఖ కేంద్రంగా పాలనకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. వేసవి సెలవుల్లోనే విశాఖకు కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖకు సీఎంవో.. ఇతర కార్యాలయాల తరలింపుపై కేబినెట్ చర్చించే అవకాశముంది. అలాగే నవరత్నాల అమలు, ఇళ్ల పట్టాల పంపిణీపైనా చర్చించనున్నారు.