మండే..మండలి : 27న ఏపీ కేబినెట్ మీటింగ్

  • Publish Date - January 24, 2020 / 11:47 AM IST

ఏపీ శాసనసమండలి భవిష్యత్‌ ఏంటో సోమవారం తేలనుంది. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 9.30గంటలకు కేబినెట్ సమావేశం కాబోతోంది. సచివాలయంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ప్రధానంగా మండలి రద్దుపైనే చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం బీఏసీ సమావేశమై..అసెంబ్లీ సమావేశాలు ఇంకెన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఎదుట ప్రవేశపెట్టనున్నారు. 

శాసనసభా సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించుకుంది ఏపీ ప్రభుత్వం. రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులను కూడా శాసనసభ ఆమోదించి..శాసనమండలికి పంపించింది. ఇక్కడ టీడీపీకి సంఖ్య అధికంగా ఉంది. అనూహ్యంగా రూల్ 71ని తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ. దీనిపై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం దీనిపై చర్చకు అనుమతినిచ్చారు స్పీకర్. ఓటింగ్‌లో టీడీపీ సభ్యులు పోతుల సునీత, సిద్ధార్థరెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా ఓట్లేశారు. అనంతరం రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ షరీఫ్ వెల్లడించారు. 

శాసనసమండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రజల మేలు కోసం తాము నిర్ణయాలు తీసుకంటే..అడ్డుగా తగలడం సరికాదని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇలా జరిగితే అసలు శాసనమండలి ఎందుకనే ప్రశ్న లేవనెత్తుతోంది. మండలి రద్దు చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 
 

* రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు శాసనమండలిలో పాస్ కాలేదు. 
* ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు. 
* ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

* మండలి రద్దుకే సీఎం జగన్, మెజార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నారు. 
* మండలి అవసరం ఏంటీనే ప్రశ్న లేవనెత్తారు సీఎం జగన్. 
* మండలి సభను నిర్వహించడం మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. 

* అంతకంటే ముందు..సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీతో సీఎం జగన్ చర్చలు జరిపారు. 
* చివరకు సోమవారం నాడు జరిగే అసెంబ్లీ సమావేశం మండలి రద్దుపై నిర్ణయం తీసుకోనుంది.