పోలీసుల ఆంక్షలు : రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ

  • Publish Date - December 23, 2019 / 09:12 AM IST

రాజధాని కోసం అమరావతి గ్రామాల్లో ఆందోళనలు మిన్నంటాయి. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం (ఆరో రోజు) రాజధాని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నారు. తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై టెంట్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ నెలకొంది. తుళ్లూరులో భారీగా మోహరించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతున్నారు.

రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పోలీసులు విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారు. రైతుల ఆందోళనలతో పోలీసులు బందోబస్తు భారీగా పెరిగింది. రోడ్లపైకి ఎవ్వరినీ రానీయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు, బయటకు వెళ్లిన వారిని ఇళ్లకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని .. స్ధానికులు మండిపడుతున్నారు. నోరు ఎత్తితేనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మందడంలోనూ రోడ్ల పైన బైఠాయించిన రైతులు.. రాజధానిని తరలిచవద్దంటూ ఆందోళన చేశారు. దీంతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. రైతులను రహదారి పైనుంచి పక్కకు తరలించేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్తత తలెత్తింది.  కృష్ణాయపాలెంలోనూ నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనల్లో మహిళా రైతుల సైతం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డుపైనే రైతులు వంటావార్పు నిర్వహించారు. అయితే రైతులు రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించడంతో .. పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతిలేదన్నారు. దీంతో… పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. 
Read More : ఎవ్వర్నీ వదలం : అమరావతి రాజస్థాన్ ఎడారిలా ఉంది : స్పీకర్ తమ్మినేని