రాజధాని కేసు.. సీఎం జగన్, చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

  • Publish Date - August 27, 2020 / 03:16 PM IST

ఏపీ రాజధాని కేసులో సీఎం జగన్, చంద్రబాబులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక మంత్రులు బొత్స, బుగ్గనతో పాటు.. టీడీపీ, వైసీపీ, బీజేపీలకు సైతం నోటీసులు ఇచ్చింది. రాజధాని తరలింపు కోసం దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేశారంటూ అమరావతి రైతులు వేసిన పిటిషన్ తో నేతలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.



నాడు అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి అమరావతిని రాజధానిగా ప్రకటిచారు. దీంతో రైతులు త్యాగాలు చేసి రాజధాని కోసం ప్రభుత్వానికి 33వేల ఎకరాలు ఇచ్చారు. తాము ఇన్ని త్యాగాలు చేస్తే, ఇవాళ మా నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాజధానిని తరలిస్తామని చెబుతున్నారని రైతులు వాపోయారు. ఈ మేరకు రైతుల తరుఫున ధర్మాసనం ముందు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వివిధ సందర్భాల్లో నాయకులు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ ను పిటిషనర్ తరఫున న్యాయవాది హైకోర్టుకి అందజేశారు. సాక్ష్యాలతో సహా వీడియో క్లిప్స్ ఇవ్వడంతో వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
https://10tv.in/three-capitals-ap-files-in-supreme-court/
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్, సీఎంగా ఉన్న చంద్రబాబుకి, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కొందరికి, బీజేపీ, వామపక్ష పార్టీలకు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు అంటే పెద్ద ఇబ్బందేమీ లేదు, కేవలం సమాధానం మాత్రమే కోరతారని న్యాయవాదులు చెబుతున్నారు. ఆ సందర్భంలో నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజలకు నమ్మకం కలిగింది, రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నందు వల్లే రైతులందరూ నాడు రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చారని, రైతుల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు చెప్పారు.