రాజధానిలో ఆందోళనలు 30వ రోజు

  • Publish Date - January 16, 2020 / 05:41 AM IST

రాజధాని ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. పండుగ పూట కూడా నిరసనలు చేపడుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో వారు ఆందోళనలు చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో రైతులు మహా ధర్నా చేస్తున్నారు. వెలగపూడి, కృష్ణయ్యపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దీక్షా శిబిరాన్ని తమ సంఘీభావాన్ని తెలియచేయనున్నారు.

మూడు రాజధానులు వద్దూ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇచ్చిన భూముల పరిస్థితి ఏంటీ ? అమరావతికి భూములు ఇచ్చిన రైతులు భవితవ్యం ఏంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి పేరిట జేఏసీ ఏర్పాటైంది. రైతులు, కూలీలు, మహిళలు, ప్రజా సంఘాలు, యువకులు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. 

మూడు రాజధానుల ప్రకటన, GN RAO, బోస్టన్ ఇచ్చిన నివేదికలపై రాజధానిలోని 29 గ్రామాల వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా టీడీపీ పార్టీ ఈ ఆందోళనలో పాల్గొంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని రైతులకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెల్లడిస్తూ..సంక్రాంతి పండుగను జరుపుకోలేదు. 2020, జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా బాబు కుటుంబసభ్యులు రైతులకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు బీజేపీ – జనసేన పార్టీలు భేటీ అయ్యాయి. ఓ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర కీలక నేతలు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు భేటీ అయ్యారు. అంతకుముందు భేటీలో చర్చించాల్సిన అంశాలపై నేతలు కసరత్తు జరిపారు. రాజధానితో సహా కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీపై ఏపీ రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. పవన్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఈ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Read More : Beating the Retreat tunes లో క్రైస్తవ గీతం తొలగింపు