ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ కొనసాగుతోంది. ఎన్నికలను ఈసీ రమేశ్ కుమార్ వాయిదా వేయడంపై అధికారపక్షం అగ్గిలమీదగుగ్గిలమౌతోంది. ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నిస్తోంది. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని, కరోనా వైరస్ సాకు చూపి పోస్ట్ పోన్డ్ చేస్తారా అంటూ ఒంటికాలిపై లేస్తోంది. సీఎం జగన్ నేరుగా గవర్నర్‌కు 2020, మార్చి 15వ తేదీ ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈసీ రమేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని, దీనిపై తాము ఎంతదాకైనా వెళుతామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈయన చేసిన ఆరోపణలకు కాసేపటికే ఈసీ రమేశ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కరోనాపై జాతీయస్థాయిలో హెచ్చరికలు, సంప్రదింపుల తర్వాతే ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గితే..ఆరు వారాలు లేదా అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగ సంస్థగా తెలిపారు. హైకోర్టు జడ్జీకి ఉండే అధికారాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఉంటుందని స్పష్టం చేశారాయన. ఏ పార్టీకి లబ్ది చేకూర్చకుండా..ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని, ఇళ్ల పట్టాల పంపిణీ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుందని తెలిపారు.
ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, బాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉగాది పండుగ రోజున పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను కూడా అడ్డుకుంటారా అంటూ మండిపడుతున్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసీ రమేష్ కుమార్‌ను నియమించింది బాబు అని, వీరిద్దరి సామాజిక వర్గం ఒక్కటే అని..అందుకే ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. మరి తాజాగా ఈసీ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుంతో వెయిట్ అండ్ సీ.
Read More : సుప్రీంకు వెళుతాం..రమేశ్ కుమార్‌కు సిగ్గుంటే..రాజీనామా చేయాలి – విజయసాయిరెడ్డి