ఏపీలో తొలి ఫలితాలు వచ్చేది ఈ నియోజకవర్గాల్లోనే!

Mukesh Kumar Meena: కనిష్ఠంగా కొవ్వూరు, నర్సాపురంలో 13 రౌండ్లు ఉంటాయని తెలిపారు. 13 రౌండ్లలో ముగిసే కౌంటింగ్ స్థానాల ఫలితాలు మొదట వస్తాయి.

AP Election 2024 Counting: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ రౌండ్‌ల సంఖ్యపై స్పష్టతనిచ్చారు. పార్లమెంట్ పరిధిలో గరిష్ఠంగా అమలాపురంలో 27 రౌండ్లు ఉంటాయన్నారు. అలాగే, కనిష్ఠంగా రాజమండ్రి, నర్సాపురంలో 13 రౌండ్లు ఉంటాయని చెప్పారు.

కొవ్వూరు, నర్సాపురం ఫలితాలు ఫస్ట్..
అసెంబ్లీ పరిధిలో గరిష్ఠంగా భీమిలీ, పాణ్యంలో 26 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని ముకేశ్ కుమార్ మీనా వివరించారు. కనిష్ఠంగా కొవ్వూరు, నర్సాపురంలో 13 రౌండ్లు ఉంటాయని తెలిపారు. 13 రౌండ్లలో ముగిసే కౌంటింగ్ స్థానాల ఫలితాలు మొదట వస్తాయి. 26 లేదా 27 రౌండ్లలో జరిగే కౌంటింగ్ ఫలితాలు ఆలస్యంగా వస్తాయి.

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు
మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారన్నారు. 26,721 మంది సర్వీసు ఓటర్ లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారని చెప్పారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని తెలిపారు.

Also Read: మంగళవారం ఉదయం 11 గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలని మా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాం: సజ్జల

33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్
ఆ తర్వాత 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. వదంతుల కట్టడికి చర్యలు చేపట్టామని అన్నారు. ఏజెంట్లు అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తే బయటకు పంపుతామని, కేసు పెట్టి జైలుకు కూడా పంపుతామని చెప్పారు.