Ap Free Gas Cylinders Scheme (Photo Credit : Google)
Diwali Gift : మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక అందించనున్నారు. సివిల్ సప్లయ్స్ శాఖపై రివ్యూ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. మరో సంక్షేమ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ కి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం కింద అర్హులైన వారికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.2వేల 684 కోట్ల భారం పడనుంది. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీపం పథకం గొప్ప స్కీమ్ అని అన్నారు.
సూపర్ -6లో భాగమైన ఉచిత సిలిండర్ల స్కీమ్ కి సీఎం చంద్రబాబు ఇవాళ ఆమోదం తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఈ నెల 31 నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ దీపం పథకంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరక్కుండా ఈ పథకం కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ స్కీమ్ కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ నెల 31వ తేదీన దీపం పథకం ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించడం జరుగుతుందన్నారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లు జరక్కూడదని సీఎం చంద్రబాబు అధికారులతో తేల్చి చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారులు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ ను పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులతో చెప్పారు సీఎం చంద్రబాబు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈ నెల 24వ తేదీ నుంచి బుకింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులతో చెప్పారు. ఈ నెల 31వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండర్లు పొందిన రెండు రోజుల్లో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో.. సబ్సిడీ మొత్తాన్ని జమ చేయాలని, అందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. మహిళలకు ఇంటి ఖర్చు తగ్గించాలనే ఆలోచనలో ఈ పథకానికి రూపకల్పన చేశామన్నారు చంద్రబాబు.
రిటైల్ మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.876గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25 సబ్సిడీ ఇస్తోంది. ప్రతి సిలిండర్ మీద రూ.851 పడుతుంది. అయితే, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 2వేల 684 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఐదేళ్లకు గాను 13వేల 423 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అయినా ఈ భారాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read : ఏపీ ప్రభుత్వం బాధపడాల్సి వస్తుంది..! తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..