Chandrababu Naidu
Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. శాఖల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని ఓ విధంగా హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ వృద్ధిరేటు అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై సూచనలు చేశారు.
ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంచమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 32వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, విద్యుత్ శాఖకు కోటి పది లక్షల కోట్లు అప్పులు చేశారని చంద్రబాబు అన్నారు. పీపీఎలను రద్దు చేసి గత ప్రభుత్వం రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని రూ.4.92కు తగ్గించామని చెప్పారు.
ప్రతిఒక్కరూ డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు.. ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలి. కొందరు నెగిటివ్ కు అలవాటు పడ్డారు. నీతి నిజాయితీగా పని చేయాలి.. ప్రజలకు ఫలితాలు రావాలని చంద్రబాబు సూచించారు.
దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ అనుకున్నంతగా ఫలితాలు రావడం లేదు. అందరికీ జనవరి 15వ తేదీ వరకు డెడ్ లైన్. ఎవరికీ మినహాయింపు లేదు. ఆ తరువాత ఆశించిన మేర ఫలితాలు రాకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీని స్మార్ట్ గా ఉపయోగించుకొని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే?
• ఐదేళ్లల్లో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించేలా కృషి చేస్తున్నాం.
• అందరం కలిసి సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం.
• ఒక్క పెన్షన్లలోనే ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్లకు పైగా పేదలకు పంపిణీ చేశాం
• ఏపీ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రాండ్. గత పాలకుల వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది
• కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ బ్రాండ్ తిరిగి తీసుకురాగలిగాం
• విశాఖ సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. మన యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయి.
• ఎప్పటికప్పుడు ఎస్ఐపీబీలు పెట్టుకుని పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నాం
• మొదటి త్రైమాసికంలో 12.02 శాతం గ్రోత్ రేట్ వచ్చింది. రెండో త్రైమాసికంలో 11.28 శాతం వృద్ధి నమోదు అయ్యింది
• 8.70 శాతం జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి సాధించగలిగాం
• ఇక భవిష్యత్ కాలానికి 17.11 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం.
• ఏపీ అభివృద్ధి గురించి పార్లమెంటులో చెప్పే స్థాయిలో మనం అభివృద్ధి చెందుతున్నాం.
• నీటి భద్రత విషయంలో ముందు చూపుతో పని చేశాం. సాగు నీటి ప్రాజెక్టుల్లో 944 టీఎంసీల నిల్వ చేసుకున్నాం
• ఉన్నతాధికారులంతా శాస్త్రీయంగా ఆలోచన చేసి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.
• రాష్ట్రాన్ని జోన్లుగా, రీజియన్లుగా, కారిడార్లుగా, క్లస్టర్లుగా, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.