CM Chandrababu Naidu : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు.. మన టార్గెట్ ఇదే..!

CM Chandrababu Naidu : అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జాతీయజెండాను ఎగుర వేశారు.

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు స్పష్టమైన లక్ష్యంతో ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌ను రూపొందించామని చంద్రబాబు తెలిపారు. “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ” లక్ష్యంగా 10 సూత్రాలను రూపొందించామని చెప్పారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై జాతీయజెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

Also Read : Independence Day Celebrations Red Fort : సప్తధార శక్తి సామర్థ్యాలతో దేశం నూతన శిఖరాలకు.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ప్రసంగంలో హైలెట్స్ ఇవే..

తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిందని, అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా తెలుగు ప్రజలకు గర్వకారణమని చంద్రబాబు అన్నారు. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు స్వేచ్ఛా భారతదేశం కోసం కలలు కన్నారని.. వారు పోరాడి, త్యాగాలు చేసి ఆ స్వేచ్ఛను మనకు అందించారని, ఇప్పుడు దేశం కోసం పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 2047 నాటికి భారత్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌-1గా నిలపాలనే సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని.. ఇప్పుడు దేశానికి మనం ఏం ఇవ్వగలమో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. “నా దేశం-నా బాధ్యత” అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. చేతిలో జాతీయ జెండాతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు నిరంతరం పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ రంగంలో బాధ్యతగా పనిచేయడమే ‘అనే నేను..’ సంకల్పానికి అర్థమన్నారు.

విద్యార్థులు నైపుణ్యంతో ఆవిష్కరణలు చేయాలని, రైతులు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని, మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని అన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విజయం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని చంద్రబాబు అన్నారు. కోట్లాది మంది భారతీయుల ఆలోచనలు ఒక్కటైతే అది దేశ సంకల్పంగా మారుతుందని చెప్పారు. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం.. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని గెలుద్దామని చంద్రబాబు ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర లక్ష్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్‌కు బలమైన రాష్ట్రాలు అవసరమని, స్వర్ణాంధ్రకు బలమైన దేశం అవసరమని చెప్పారు. ఐక్యత, బాధ్యత, సమష్టి కృషితో స్వర్ణాంధ్రను నిర్మించి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేద్దామని అన్నారు.

గత ప్రభుత్వం నిలిపివేసిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించామని చెప్పిన చంద్రబాబు.. 26 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లను సంక్షేమానికి, రూ.1.34 లక్షల కోట్లను అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్ర వృద్ధి రేటు 13.5 శాతం ఉండగా, 2019-24 మధ్య 10.3 శాతానికి పడిపోయిందని తెలిపారు. వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడంతో ప్రస్తుతం వృద్ధి రేటు 11.3 శాతానికి పెరిగిందన్నారు.

అభివృద్ధి ఒక్క నగరానికే పరిమితం కాకూడదని, మూడు ప్రాంతాలు, ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టామని తెలిపారు.