CM Jagan : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఏపీకి బయల్దేరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం జగన్‌ బిజీబిజీగా గడిపారు.

CM Jagan Delhi Tour Ends : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఏపీకి బయల్దేరారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం జగన్‌ బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, షెకావత్‌‌, జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వారితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి సీఎం జగన్ చర్చలు జరిపారు. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌.. రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ నిన్న రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. శుక్రవారం ఉదయం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ను సీఎం జగన్ కలిశారు.

రాష్ట్ర సివిల్ సప్లయ్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని పీయూష్ గోయల్‌ను సీఎం జగన్ కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. సీఎం జగన్‌ వెంట
ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు