Cm Jagan
CM Jagan : సీఎం జగన్ సోమవారం(ఆగస్టు 16,2021) తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ నుంచే నాడు-నేడు తొలి దశలో పూర్తి చేసిన పనులను ప్రజలకు అంకితం చేసి రెండో దశ నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టానున్నారు సీఎం జగన్.
ఆ తర్వాత జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు వర్షసూచన ఉన్నందున ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
విద్యారంగంలో సమూల మార్పుల కోసం అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు నేడు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పి.గన్నవరంలో ‘జగనన్న విద్యాకానుక’ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుక అందించనున్నారు. మొత్తం 47.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బాగ్ ఇవ్వనున్నారు. ఈసారి అదనంగా ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందించనున్నారు. గతేడాది విద్యాకానుక కింద 42.34 లక్షల మంది విద్యార్థులకు కిట్స్ అందించారు.