CM Jagan Disha : దిశ యాప్‌ ఉంటే అన్న తోడున్నట్టే

ప్రతి మహిళకు దిశ యాప్‌ అవసరమని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ap cm jagan disha app women safety : ప్రతి మహిళకు దిశ యాప్‌ అవసరమని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని సీఎం అన్నారు. ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో భాగంగా మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని జగన్ వివరించారు.

దిశ యాప్‌ను ప్రతిఒక్క మహిళతో డౌన్‌లోడ్ చేయించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఘటన తనను కలిచివేసిందని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. యువతులు, మహిళల భద్రత కోసం ఈ దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ దగ్గర దిశ యాప్ ఉండాలని సూచించారు. ఫోన్‌లో దిశ యాప్‌ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని.. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులను.. మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పారు.

అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్‌ విధానంలో వీక్షించారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరించారు.

ట్రెండింగ్ వార్తలు