ఏపీకి రూ.33వేల కోట్లు త్వరగా ఇవ్వండి, కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి

  • Publish Date - September 23, 2020 / 12:11 PM IST

ఢిల్లీ టూర్ లో ఉన్న ఏపీ సీఎం జగన్ బుధవారం(సెప్టెంబర్ 23,2020) ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు పెండింగ్‌ నిధుల విడుదల, ఏపీ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకారంపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్రం ఖర్చు చేసిన రూ.4వేల కోట్లు, పునరావాసం, పరిహారం కింద రూ.33వేల కోట్లను త్వరగా ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు రావాలని గజేంద్రసింగ్ షెకావత్‌ను జగన్ ఆహ్వానించారు.

జగన్ ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని సీఎం జగన్‌ కోరగా, త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అలాగే గోదావరి-కావేరి నధుల అనుసంధానంపైనా చర్చ జరిగింది. నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ వేదిరే శ్రీరామ్‌కు జలశక్తి మంత్రి షెకావత్‌ సూచించారు. సీఎం జగన్‌ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి ఉన్నారు. 2021 డిసెంబర్‌ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది.

కాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం(సెప్టెంబర్ 22,2020) సాయంత్రం హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు మూడు రాజధానుల అంశం, దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు 40నిమిషాల పాటు అమిత్‌షాతో జగన్ చర్చించారు. కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న పలు అంశాలపై అమిత్‌షాతో జగన్ చర్చలు జరిపారు.


ట్రెండింగ్ వార్తలు