జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో అసలు ట్విస్ట్..!

  • Publish Date - July 23, 2020 / 08:09 PM IST

ఎన్నికల కమిషనర్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత ఈజీగా తీసుకొనేలా కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్‌ నియామకంపై ప్రభుత్వం ఎంత మాత్రం ఆసక్తిగా లేదు. ముఖ్యంగా సీఎం జగన్‌ అయితే రమేశ్‌ కుమార్‌ పట్ల ఆగ్రహంగా ఉన్నారు.

నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తగిన చర్యలు తీసుకోండని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో నిమ్మగడ్డను తిరిగి నియమించాలని గవర్నర్‌ స్పష్టం చేశారనే అభిప్రాయం కలిగింది. కాకపోతే గవర్నర్‌ లేఖకు ప్రభుత్వ వర్గాలు పూర్తి భిన్నంగా వ్యాఖ్యానిస్తున్నాయి. నిమ్మగడ్డను పునర్నియమించాలని గవర్నర్‌ చెప్పలేదని పేర్కొంటున్నాయి.

ప్రభుత్వ ఒత్తిళ్లతో నియామకం రద్దు :
నిమ్మగడ్డ పదవీకాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను, నూతన కమిషనర్‌గా రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ నియామకానికి జారీచేసిన జీవోలను కొట్టివేస్తూ హైకోర్టు మే నెల 29న తీర్పు ఇచ్చింది. తర్వాత తాను మళ్లీ బాధ్యతలు స్వీకరించానని నిమ్మగడ్డ ప్రకటించారు.

కానీ, ప్రభుత్వ ఒత్తిళ్లతో ఎన్నికల సంఘం కార్యదర్శి ఆ నియామకాన్ని రద్దు చేశారు. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మూడు సార్లు ఇందుకు నిరాకరించింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలాడొద్దని ఆ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడింది కూడా.

మరోవైపు హైకోర్టులో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు నిమ్మగడ్డ. సుప్రీం స్టే ఇవ్వనందున తమ ఆదేశాలు అమలు చేయాలని సర్కార్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. పునర్నియామకానికి సంబంధించి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని నిమ్మగడ్డకు సూచించింది. గవర్నర్‌ను కలిసి తన నియామకానికి చర్యలు తీసుకోవాలని రమేశ్‌కుమార్‌ అభ్యర్థించారు. గవర్నర్‌ దీనిపై సానుకూలంగా స్పందించారు. కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధంగా లేదంటున్నారు.

అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది :
గవర్నర్‌ను కలిసేందుకు ఈనెల 17నే రమేశ్‌కుమార్‌ సిద్ధమయ్యారు. గవర్నర్‌ ఆయనకు 20వ తేదీన సమయం ఇచ్చారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

ఈలోగా ప్రభుత్వం ఆయన్ను నియమించే అవకాశాలు లేవని అంటున్నారు. సుప్రీంకోర్టు స్పందించే తీరును బట్టి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో అసలు ట్విస్ట్ మొదలైనట్టేనని అంటున్నారు. అసలు వ్యవహారం ఇప్పుడే స్టార్ట్‌ అయ్యిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

సుప్రీం తీర్పు తర్వాతే జగన్‌ నిర్ణయం :
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. గవర్నర్ ఆదేశాలు జారీచేసినా.. నిమ్మగడ్డ పునర్ నియామకం విషయంలో జగన్ సర్కార్ ముందుకెళ్లకపోవచ్చు. సుప్రీం తీర్పు తర్వాత ఏ నిర్ణయం అన్నది తీసుకోవచ్చనే ఉద్దేశంలో జగన్‌ ఉన్నారట. సీఎం జగన్ పట్టబట్టి నిమ్మగడ్డను తొలగించినందున ఇప్పుడు ఆయనను నియమిస్తే నైతికంగా ఓడిపోయినట్టేనని అంటున్నారు. అందుకే నిమ్మగడ్డ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే జగన్‌ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది.

జస్టిస్ కనగరాజ్ నియామకంపై ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఉపసంహరించుకోలేదు. అంటే కనగరాజ్ ఆర్డినెన్స్ విషయంలోనూ గవర్నరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టులో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో హడావుడిగా నిర్ణయం తీసుకోలేమని గవర్నర్‌కు ఏపీ సర్కార్ చెప్పే అవకాశం ఉందంటున్నారు.

దీంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ప్రభుత్వం దీన్ని సాగదీసే కొద్దీ నిమ్మగడ్డ మరో సారి హైకోర్టును ఆశ్రయించ వచ్చని అంటున్నారు. మొత్తం కోర్టులతోనే ఈ విషయాన్ని సాగదీస్తూ వెళ్లేందుకు సర్కార్‌ సిద్ధపడుతున్నట్టు భావిస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.