CM Jagan respond raising Polavaram height : పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గించమన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు సెంటీమీటర్ కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపైన శుక్రవారం (నవంబర్ 27, 2020) నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలకు అందరూ సిద్ధం కావాలన్నారు. హోమ్ వర్క్ చేయకుండా సభకు వస్తే అబాసుపాలవుతారని పేర్కొన్నారు. శాసన మండలిలో వ్యూహంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఈ అంశంలో మంత్రి బుగ్గన సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో నివార్ తుపాన్‌పై ప్రధానంగా చర్చించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 289 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని మంత్రి కన్నబాబు తెలిపారు.
పదివేల మందికి పైగా వరద బాధితులను సహాయక శిబిరాలకు తరలించామన్నారు. 30 వేల హెక్టార్టలో వ్యవసాయ పంటలు, 13 వందల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు.