పోలవరం వద్ద సీఎం జగన్, 2022 ఖరీఫ్ నాటికి సాగునీరు

  • Publish Date - December 14, 2020 / 01:42 PM IST

AP CM YS Jagan Polavaram Project Inspection : 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం పోలవరంలో పర్యటిస్తున్న సీఎం మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. పోలవరం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు..మంత్రులు ఘన స్వాగతం పలికారు. పోలవరం పర్యటనలో భాగంగా.. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు.

ప్రాజెక్టు స్పిల్‌వేపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాన్ని, ఎగువ కాఫర్‌ డ్యామ్, ECRF డ్యామ్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక పరమైన అంశాలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. సీఎం జగన్ వెంట మంత్ర అనీల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు.

పోలవరం ప్రోజెక్టును ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించింది. పనులు శరవేగంగా జరిగే విధంగా చూస్తోంది. 2021 డిసెంబర్‌కు ప్రాజెక్టును పూర్తి చేసి 2022 ఖరీఫ్ నాటికి నీరు అందించే లక్ష్యంతో పనులను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా పనుల్లో మరింత వేగం పెంచేందుకు సీఎం జగన్ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇటీవల పోలవరం అంచనాల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 2014 అంచనాలకు అంగీకరించడం వల్లనే కొత్త అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలు పెడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

దీనికి టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. ప్రభుత్వ చేతకాని తనం వల్లే పోలవరం నిధులు తెచ్చుకోలేకపోతున్నారని ఆరోపించింది. ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రతిపక్షం మీదకు నెడుతోందని విమర్శించింది. నిధులేకాదు… పోలవరం ఎత్తుపైనా ఏపీలో రాజకీయ రగడ నెలకొంది. ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తే ప్రభుత్వం మాత్రం ఇంచు ఎత్తు కూడా తగ్గదని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు