CM Jagan Review on Cyclone Gulab : గులాబ్ తుపాను పరిస్ధితిపై సీఎం జగన్ సమీక్ష

గులాబ్ తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

CM Jagan Review on Cyclone Gulab : గులాబ్ తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన గులాబ్‌ తుపాను కారణంగా రాష్ట్రంలో తలెత్తిన పరిస్ధితులపై తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు.

వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకూ విద్యుత్‌ పరిస్థితులపై సమాచారం తెప్పించుకుని…. అవసరమైన వెంటనే చర్యలు తీసుకుని, విద్యుత్‌ను పునరుద్ధరించాలని సీఎం అన్నారు. ఇవాళ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయొద్దని…..బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సీఎఁ అధికారులను ఆదేశించారు.

సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని….రక్షిత తాగునీరు, తుపాను బాధితులకు మంచి వైద్యం అందించాలని ఆయన చెప్పారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ….విశాఖ నగరంలో ముంపు ప్రాంతాల్లో వర్షపు నీటిని పంపింగ్‌  చేసేందుకు మోటార్లు సిధ్దం చేయాలని….ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా సీఎం జగన్ అన్నారు.

ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బంది పడుతున్న లోతట్టు కుటుంబాలను ఆదుకోవాలన్న సీఎం…ఆయా కుటుంబాలకు రూ.1000 చొప్పున ఇవ్వాలన్నారు. సహాయ శిబిరాలనుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.1000 చొప్పున ఇవ్వాలని కూడా సీఎం ఆదేశించారు. వర్షపు నీరు కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున వాటర్‌ ట్యాంకర్లు ద్వారా తాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి అన్నారు.

జనరేటర్లతో వాటర్‌ స్కీంలు నిర్వహించాలన్న సీఎం….పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఎన్యుమరేషన్‌చేయాలన్నారు. నష్టం అంచనాలు వెంటనే సిద్ధంచేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఒడిశాలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నందున, అకస్మాత్తుగా వరదనీరు పెరిగే అవకాశాలున్నాయని…వంశధార, నాగావళి… నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంచేయాలని సీఎం జగన్ చెప్పారు.

రిజర్వాయర్లలో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. నీటిని దిగువకు విడుదలచేయాలని…..మానవతప్పిదాలు ఎక్కడా లేకుండా చూసుకోవాలని జగన్ అధికారులను హెచ్చరించారు. దేవుడి దయవల్ల హుద్‌హుద్, తిత్లీ స్థాయిలో గులాబ్‌ తుపాను లేదని..అతిభారీ, భారీ వర్షాలు పడుతున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు