Ap Cm Ys Jagan To Meet Pm Modi In Delhi
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. ఇవాళ రాత్రికి 1 జన్‌పథ్ నివాసంలో బస చేస్తారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ అవుతారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది.
పవన్ కూడా
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పవన్ కల్యాణ్ కూడా వెళ్తున్నారు. సీట్ల సర్దుబాటుపై బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు. ఏపీలోని రాజకీయ పరిస్థితులు, టీడీపీతో జరుగుతోన్న సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.
ఎన్డీయే కూటమిలో టీడీపీని చేర్చేలా ఏడాదిన్నర నుంచి ప్రయత్నిస్తున్నారు పవన్. అలాగే, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు బుధవారం రాత్రి ఢిల్లీలో సమావేశమై పొత్తులపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. తమ నిర్ణయాన్ని చంద్రబాబు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.