ap congress: జాతీయ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అటు దేశంలోనూ.. ఇటు ఏపీలోనూ ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఫలించడం లేదు. ప్రభుత్వాలపై గళమెత్తడంలో కూడా సక్సెస్ కాలేకపోతోంది. ఏపీ విషయంలో పార్టీ చీఫ్ శైలజానాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదంటున్నారు. ఒకవైపు వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తేందుకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా బీజేపీ పోరాడుతోంది. కాంగ్రెస్ మాత్రం దళితులపై సాగుతోన్న దాడులే అజెండాగా తీసుకుంది. వారి సమస్యలపైనే శైలజానాథ్ స్పందిస్తూ మిగతా సమస్యలపై లైట్ తీసుకుంటున్నారని అంటున్నారు.
మరింత దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి:
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్ధితి మరింత దిగజారింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి పెద్ద నేతలంతా వలసలు వెళ్లిపోయారు. మిగిలిన అరకొర నేతలతో గట్టెక్కేందుకు నానా కష్టాలు పడుతోంది. కొత్త అధ్యక్షుడిగా శైలజానాథ్ బాధ్యతలు చేపట్టాక పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అన్ని అంశాలపైనా ఆందోళనలు చేపడుతున్నాయి. కానీ, కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ మాత్రం దళిత సమస్యలపైనే స్పందిస్తున్నారు.
ఒకే అంశంపై పోరాటం చేస్తే ఎలా?
రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలను లైట్‌గా తీసుకుంటుండడంతో ఆ పార్టీలోని నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సమస్యలపైనా పోరాడుతూ ముందుకు వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఒకే అంశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ ఎత్తుకోవడంతో ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఈ విషయమై ఆయనను అడగలేకపోతున్నారట. పార్టీ యాక్టివిటీ పెరగకపోవడంతో చేసేదేమీ లేక మౌనం వహిస్తూ పార్టీ తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం రావాలంటే కచ్చితంగా ప్రతీ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి.
కేడర్ కూడా చేజారే ప్రమాదం:
ప్రస్తుత పరిస్ధితుల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా ఉంటే కేడర్ కూడా చేజారే ప్రమాదముందని అంటున్నారు. ఒక వర్గం సమస్యలపై పోరాటంతో పాటు మిగతా సమస్యలపై అదే రీతిలో గళమెత్తితే ప్రజల్లో పట్టు పెరుగుతుందనేది నాయకులు ఉద్దేశం. మరి శైలజానాథ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తారో చూడాల్సిందే.