YS Sharmila : బాబాయ్ స‌వాల్‌ను స్వీకరించిన వైఎస్ షర్మిల.. మరోసారి జ‌గ‌న్‌ను అలా పిలవనని వెల్లడి

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వీకరించారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలని.. టైం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా మీరు చేసిన అభివృద్ధిని చూసేందుకు వస్తామని షర్మిల అన్నారు.

YS Sharmila

AP Congress Chief YS Sharmila : ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఏపీలో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో జిల్లాల పర్యటనను షురూ చేశారు. మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు రోజుకు మూడు జిల్లాల చొప్పున షర్మిల పర్యటన కొనసాగనుంది. తన జిల్లాల పర్యటనను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవారం ఇచ్ఛాపురంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాక.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను షర్మిల స్వీకరించారు.

Also Read :  వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నరసరావుపేట ఎంపీ

టైం మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..
ఇటీవల వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, కాంగ్రెస్ నాయకురాలు షర్మిలకు అభివృద్ధి కనిపించకపోతే మాతోరావాలని.. అభివృద్ధిని చూపిస్తామని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు షర్మిల తాజాగా స్పందించారు. సుబ్బారెడ్డి సవాల్ ను నేను స్వీకరిస్తానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలని, డేట్, టైం మీరు చెప్పినా సరే.. మమ్మల్ని చెప్పమన్నా సరే.. మీడియాతో సహా వస్తామంటూ షర్మిల సవాల్ చేశారు. మీరు కట్టిన రాజధాని ఎక్కడ? పోలవరం ఎక్కడ? అంటూ షర్మిల ప్రశ్నించారు. మీరు చేసిన అభివృద్ధిని చూడాలని నాతోపాటు, రాష్ట్ర ప్రజలు కళ్లకు ఒత్తులు వేసుకొని చూస్తున్నారని షర్మిల అన్నారు.

బీజేపీకి ఏపీ సీఎం జగన్ ఊడిగం చేస్తున్నారని, బీజేపీకి ఏపీ సీఎం, ఎంపీలు బానిసలుగా మారారంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా జగన్ మాట్లాడరు.. ఇదే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచుతా అంటూ ప్రగల్భాలు పలికాడు.. ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైందో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నించారు.

Also Read : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల తొలగింపును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

జ‌గ‌న్‌ను అలా పిలవను ..
ఇటీవల వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తన సోదరుడు, ఏపీ సీఎంను జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ మాట్లాడారు.. ఈ క్రమంలో వైసీపీ నేతలు షర్మిల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. తాజాగా షర్మిల మాట్లాడుతూ.. జగన్ రెడ్డి అని పిలిస్తే వైసీపీ వాళ్లు ఫీల్ అవుతున్నారు.. జగన్ రెడ్డి అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటే జగన్ అన్నా అని పిలుస్తా నాకేం అభ్యంతరం లేదు అంటూ షర్మిల సెటైరికల్ గా అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు