ప్రధానిని అడిగి 10వేల కోట్లు తెండి, కాదంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేయండి- సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల డిమాండ్

ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోడీని నిలదీయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బు తీసుకురావాలి.

Ys Sharmila (Photo Credit : Google)

Ys Sharmila : విజయవాడ వరద బాధితులకు సాయం విషయంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీలపై నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీపై బీజేపీకి చిన్నచూపు ఎందుకు? అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎక్కడెక్కడో తిరుగుతారు.. ఏపీకి ఎందుకు రావడం లేదు? అని నిలదీశారామె. ప్రధాని మోడీ రాష్ట్రానికి అని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. బీజేపీతో ఉండటం వల్ల మనకి ఒరిగిందేమీ లేదన్నారు షర్మిల. ఢిల్లీకి వెళ్లికి సాయం తీసుకురండి, కాదంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేయండి అని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు షర్మిల.

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటించారు. రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు దుప్పట్లు, ఆహార వస్తువుల కిట్ పంపిణీ చేశారు షర్మిల. విజయవాడలో ‌వరద బీభత్సం అందరం చూశామన్న షర్మిల.. బుడమేరు ముంపు వల్ల 7 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని వాపోయారు. 50 మంది వరదల వల్ల‌ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అపారమైన ఆస్తి నష్టంతో ప్రజలు దెబ్బ తిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

”విజయవాడకు సమీపంలో అమరావతి ఉంది. ఒక్క విజయవాడలో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది? 6,888 కోట్లు నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర బృందాలు వచ్చాయి, చూశాయి, వెళ్లాయి.. కానీ, ఏమీ చేయలేదు. ఏపీపై బీజేపీకి చిన్నచూపు ఎందుకు? ఏపీ నుంచి ఎంపీ లను ఇస్తేనే బీజేపీ అధికారంలో ఉంది. మోడీ ఎక్కడెక్కడో తిరుగుతారు. ఏపీకి ఎందుకు రావడం లేదు? ఏపీకి అన్ని విధాలా మోడీ మోసం చేశారు. అధికారం ఇచ్చిన ఏపీపై మోడీకి చిన్నచూపు ఎందుకు? బీజేపీతో ఉండటం వల్ల మనకి ఒరిగిందేమీ లేదు. చంద్రబాబు దీనిపై వెంటనే సమాధానం చెప్పాలి.

మేము కేంద్రానికి ఇక్కడి సమస్యలపై లేఖ రాశాం. ఇక్కడ గుక్కెడు మంచి నీళ్లు కూడా అందడం లేదు. ప్రజల బాధలు వింటే ఆవేదన కలుగుతుంది. ఇంట్లో సామాన్లు ఒక్కటీ మిగల్లేదు. పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు తారుమారయ్యాయి. రేషన్ బియ్యం ఇచ్చారంట. అవి ఎలా తింటారు? ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే‌ చంద్రబాబు ఏం చేస్తున్నారు?

రైల్ నీరు విజయవాడలోనే తయారు చేస్తారు. 6వేల కోట్లు ఆదాయం ఇచ్చే రైల్వేకు ప్రజల పట్ల బాధ్యత లేదా? తాగునీరు ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసినా స్పందన లేదు. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని బీజేపీతో ఉండటం అవసరమా? చంద్రబాబు ఆలోచన చేయాలి. బుడమేరు ముంపు తప్పు మీదంటే మీదని వైసీపీ, టీడీపీ విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో వైఎస్ ఆపరేషన్ కొల్లేరు చేపట్టి కొంతవరకు పనులు చేశారు. ఆ తర్వాత వచ్చిన వారు ఆక్రమణలు ప్రోత్సహించారు. కనీసం కాలువల మరమ్మతులు కూడా చేయలేదు. ఈ బుడమేరు ముంపునకు అందరూ కారకులే.

ప్రజల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ రావాలి. ఆక్రమణలు పూర్తిగా తొలగించి చర్యలు తీసుకోవాలి. వరద బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలి. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలకు ఓటమి తప్పదు. ఇది గుర్తిస్తూ చంద్రబాబు ప్రతి కుటుంబానికీ లక్ష సాయం చేయాలి. కనీసం పదిహేను‌ వేలు ఇప్పుడు తక్షణ సాయం ఇవ్వాలి. పంట నష్టం కూడా అంచనా వేసి రైతులను ఆదుకోవాలి. మారుమూల ప్రాంతాలకు సాయం అందేలా చూడాలి.

Also Read : దేవినేని అవినాశ్‌ టీడీపీకి శాశ్వత శత్రువుగా ఎందుకు మారారు? అసలేం జరిగింది..

చిన్నపిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బు తీసుకురావాలి. ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోడీని నిలదీయాలి. చిన్నపిల్లల నుంచి డబ్బు అనేది చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్. పిల్లల దగ్గర ఎందుకు? మోడీ నుంచి 10వేల కోట్లు తేవాలి. చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి సాయం తెండి. కాదంటే బీజేపీ నుంచి బయటకి రండి” అని వైఎస్ షర్మిల అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు