ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు, ఇద్దరు మృతి

  • Publish Date - December 11, 2020 / 05:26 PM IST

AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 64,425 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 520 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,74,515లకు చేరాయి.

రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి ఇద్దరు మరణించారు. 519 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా పరీక్షలను 1,06,99,622 పరీక్షించినట్టు ఏపీ ప్రభుత్వం బులెటిన్ లో వెల్లడించింది.

రాష్ట్రంలో మొత్తంగా 8,62,230 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,236 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,049కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల కృష్ణలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు.