AP Employees Protest : ఏపీ ఉద్యోగుల ఉద్యమానికి డేట్ ఫిక్స్.. 3 దశల్లో పోరాటం, ‘ సీఎం సారూ.. మా డబ్బులు మాకివ్వండి’!

AP Employees Protest : ఏపీలో ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ అమరావతి 3 దశల్లో ఉద్యమానికి కార్యాచరణ ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి నిరసనలు, సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్, మూడో దశలో సమ్మెకు ప్రణాళికను సిద్ధం చేసింది.

AP Employees Protest ( Image Credit : Representative image)

  • ఏపీ ఉద్యోగులు ఉద్యమ బాట
  • ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపీజేఏసీ అమరావతి
  • 29 ప్రధాన డిమాండ్ల సాధన కోసం దశలవారీ పోరాటం
  • ‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో ఉద్యమం

AP Employees Protest : ఏపీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ఈ నేపథ్యంలోనే ఏపీ జేఏసీ అమరావతి 3 దశల్లో ఉద్యమానికి కార్యాచరణను ప్రకటించింది. ఉద్యోగుల హక్కులు, బకాయిల విడుదల, పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన సహా మొత్తం 29 డిమాండ్ల సాధనే తమ పోరాట లక్ష్యమని ఉద్యోగ సంఘం స్పష్టం చేసింది.

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.40 వేల కోట్లకు పైగా ఉన్నాయని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని మరింత పరీక్షించడం సరికాదని, ఈ ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని, న్యాయమైన హక్కుల సాధన కోసమేనని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

ఆగస్టు 31 నుంచి తొలి దశ ఉద్యమం :

ఉద్యోగుల ఉద్యమంలో భాగంగా ఆగస్టు 31న జిల్లా కలెక్టర్లకు పీజీఆర్ఎస్ ద్వారా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు నుంచి తొలి దశ కార్యక్రమాలను చేపట్టనున్నారు. సెప్టెంబర్ 1న ‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’ అనే నినాదంతో సెల్‌ఫోన్ డీపీలు పెట్టుకుని ఉద్యోగులు నిరసన చేపట్టనున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 8 వరకు ‘హ్యాండ్ టు హ్యాండ్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయనున్నారు.

సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 11న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. తదుపరి కార్యాచరణపై ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు చర్చించనున్నాయి.

Read Also : Rakhi Gift Tax : సోదరికి రాఖీ గిఫ్ట్‌గా డబ్బు, బంగారం, ఇల్లు ఇస్తే ట్యాక్స్ ఎవరు కట్టాలి? అసలు రూల్ ఇదే!

సెప్టెంబర్ 15 నుంచి రెండో దశ :
మొదటి దశ తర్వాత సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 26 వరకు రెండో దశ ఉద్యమం కొనసాగనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రధానంగా ‘వర్క్ టు రూల్’ చేపట్టనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు సోషల్ మీడియాలో ఫొటోలు, డీపీలు, రీల్స్ ద్వారా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయనున్నారు.

సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను అందజేయనున్నారు. సెప్టెంబర్ 17న నల్ల కండువాలతో నిరసనలు, మానవహారాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 23న కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, సెప్టెంబర్ 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి ‘మా డబ్బులు మాకివ్వండి’ నినాదంతో ధర్నా చేపట్టనున్నారు.

మూడో దశలో ఉద్యమం ఉధృతం :

రెండో దశ తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే మూడో దశలో రిలే నిరాహార దీక్షలు, సహాయ నిరాకరణ, ఛలో విజయవాడ, చివరకు నిరవధిక సమ్మె వంటి కార్యక్రమాలకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.

ఉద్యోగుల ఉద్యమానికి ఏఐటీయూసీ, సీఐటీయూతో పాటు విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించినట్లు జేఏసీ తెలిపింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.