Visakhapatnam : విశాఖలో 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం.. అర్ధరాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా మాయం!
Visakhapatnam : విశాఖ నగరంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది.
four year old girl kidnapped
Visakhapatnam : విశాఖ నగరంలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు వ్యక్తులు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read : Strait Of Hormuz : అమెరికా సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్..! హర్ముజ్‌లో ఆల్ క్లియర్.. ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్..
విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ భార్యాభర్తలు. వీరు షాపులకు ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం కుటుంబంతో కలిసి విజయవాడ నుంచి విశాఖకు వచ్చారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై రాత్రివేళ తమ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సుమారు 2.30 గంటల సమయంలో తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా చిన్నారి కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. వారు చిన్నారిని గాజువాక వైపు తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన స్కూటీ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వాహనం వివరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. చిన్నారి కిడ్నాప్‌లో ప్రతిభ, ఉపేంద్ర అనే ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్, స్కూటీ నంబర్, నిందితుల కదలికలను ఆధారంగా చేసుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చిన్నారిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
