Ambati Rambabu: వైకాపా నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలంటూ ఆదేశాలు
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు(Ambati Rambabu)కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
enforcement directorate notices to ycp leader ambati rambabu
- అంబటికి ఈడీ నోటీసులు
- విచారణకు ఫోన్ కాల్
- ఏపీలో బిగ్ కలకలం
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు ఆయనకు నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 11వ తేదీనే విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని అధికారులు పేర్కొనగా, తనకు ఏ కేసులో నోటీసులు వచ్చాయో, ఎందుకు ఇచ్చారో తెలియదని అంబటి స్పష్టం చేశారు. దీంతో తక్షణమే తమ కార్యాలయానికి వచ్చి విచారణ ఎదుర్కోవాలని ఈడీ వర్గాలు ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
నోటీసులపై క్లారిటీ లేదు.. అంబటి రాంబాబు స్పందన:
ఈడీ నోటీసుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)స్పందిస్తూ తనకు ఎలాంటి భౌతిక నోటీసులు అందుకోలేదని తెలిపారు. అధికారులు కేవలం ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని, అయితే అసలు ఏ కేసు ఆధారంగా విచారణకు పిలుస్తున్నారో తనకు స్పష్టత లేదని ఆయన వెల్లడించారు. ఇటీవలే ఆయనపై తిరుపతిలో కేసు నమోదు కావడం, ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, దర్యాప్తు సంస్థల నుంచి తదుపరి చట్టపరమైన చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
