AP Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వారంరోజులు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ..
AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వారం రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Telangana Rains
AP Rains : ఏపీలో గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా వాటివల్ల భారీ వర్షాలు నమోదు కావడం లేదు. కేవలం తేలికపాటి వర్షాలతోనే సరిపెడుతున్నాయి. ఈ క్రమంలో సాగునీటి జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే విషయాన్ని తెలియజేసింది.
Also Read : AP Politics : కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్త్..? ఆ ముగ్గురిలో కేంద్రమంత్రి అయ్యేదెవరు.?
బంగాళాఖాతంలో శనివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల దగ్గర వాతావరణ పరిస్థితుల కారణంగా అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావం ఏపీపైనా ఉంటుందని.. దీంతో సెప్టెంబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీలో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా రాగల 48 గంటల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీలో ఎల్నినో ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్నా.. రైతులు పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాగుచేసిన పంటలకు నీరు అందక ఎండిపోతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటి వరకు సాగు పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం కాలేదు. అయితే, ఏపీ ప్రభుత్వం ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
