Ap Govt
AP Govt : ఏపీలోని పేదవర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహనిర్మాణ శాఖ పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పూర్తయిన ఇళ్లకు ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని సూచించారు. తద్వారా వచ్చే ఉగాది నాటికి ఐదు లక్షల మందికి ఇళ్ల తాళాలు అందించాలని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామని, మొత్తం 20లక్షల ఇళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే మూడు లక్షలకుపైగా ఇళ్లు పూర్తిచేసి.. లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామన్నారు. 2029 జనవరి నాటికి మిగిలిన లక్ష్యాన్ని పూర్తిచేసేలా అధికారులు వేగంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు.
మైనార్టీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన -1.0 పథకం కింద నిర్మాణం చేపట్టే ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీలకు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా.. ముస్లీంలకు కూడా రూ.50వేలు అదనంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు 18వేల మందికి రూ.90కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఆయా వర్గాలకు అదనంగా ఇస్తున్న సాయాన్ని వివరించి.. అర్హులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో పొరపాట్లు జరగకూడదని, ఆలస్యం కాకూడదని ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణాల విషయంలో పొరపాట్లు జరగకూడదని, ఆలస్యం కాకూడదని చంద్రబాబు అధికారులకు సూచించారు. అంతేకాక.. అర్హుల ఎంపికకు సర్వే కూడా వేగవంతంచేసి త్వరగా పూర్తి చేయాలని, అర్హుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలన్నారు. ఇంటి నిర్మాణానికి ఎవరికైనా స్థలం లేకపోయినా స్థలం కేటాయించాలని, ఒకవేళ ఎవరికైనా స్థలాలు ఉండి అందులో ఇల్లు నిర్మించుకుంటామని చెబితే పొసెషన్ సర్టిఫికెట్లు అందించాలని అన్నారు. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో ఇళ్ల నిర్మాణాలపై అప్ డేట్లన్నీ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.
అదేవిధంగా, ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం బిల్లులను కూడా విడుదల చేయించేలా కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ బిల్లులు ఎందుకు నిలిచిపోయాయో, లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.