Nethanna Bharosa : ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ శుభవార్త.. ఇకనుంచి ఆ ఇబ్బందులు ఉండవ్..
AP Nethanna Bharosa : ఏపీ ప్రభుత్వం చేనేతలకు పింఛన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలకు ఎదురవుతున్న సాంకేతిక, నిబంధనల ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- Harish Thanniru
- Updated on- September 12, 2026 / 02:40 PM IST
AP Handloom Weavers Bank Account Statement for Nethannaku Bharosa Scheme Removed
AP Nethanna Bharosa : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నివర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్తకొత్త పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు నేతన్న భరోసా పింఛన్ పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పథకంలో కీలక నిబంధన నుంచి కూటమి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చేనేత కార్మికులకు లైన్ క్లియర్ అయింది.
ఏపీ ప్రభుత్వం చేనేతలకు పింఛన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలకు ఎదురవుతున్న సాంకేతిక, నిబంధనల ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ సమర్పించాలనే నిబంధనను పూర్తిగా మినహాయిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత-జౌళి శాఖల మంత్రి సవిత వెల్లడించారు. ఇకపై నేతన్న భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు బ్యాంకు ఖాతా వివరాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
నేతన్న భరోసా పెన్షన్ పథకానికి సంబంధిత మాస్టర్ వీవర్స్ ఇచ్చే ధ్రువీకరణ పత్రంతో పాటు తమ వేతన వివరాలను అందజేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదని స్పష్టం చేశారు. 50ఏళ్లు నిండిన అర్హులైన చేనేత వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ అందజేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో చాలా మంది మాస్టర్ వీవర్స్ వారి దగ్గర పనిచేసే కార్మికుల వేతనాలను బ్యాంకు అకౌంట్‌లలో కాకుండా నేరుగా డబ్బుల రూపంలో చెల్లిస్తున్నారు. దీంతో చాలా మంది చేనేత కార్మికులు తమ వేతనాల చెల్లింపునకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్ వివరాలను సమర్పించలేదు. ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ నిబంధనను తొలగించింది.
మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. చేనేతలకు ఆర్థికంగా మేలు జరిగేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి నేతన్నకూ ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమ ఫలాలు అందుతాయని, ఎవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
