TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ కోటా టికెట్లు విడుదల
డిసెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా విడుదల తేదీల షెడ్యూల్‌ను తితిదే(TTD) అధికారికంగా ప్రకటించింది.
Tirumala Srivari Arjitha Seva December quota have been released
- డిసెంబర్ దర్శన టికెట్ల షెడ్యూల్
- ఆర్జిత సేవల డిప్ నమోదు
- అధికారిక వెబ్సైట్లో టికెట్ల బుకింగ్
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అత్యంత ముఖ్యమైన శుభవార్త అందించింది. రాబోయే డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300), అంగప్రదక్షిణ టోకెన్లు, గదుల కేటాయింపునకు సంబంధించిన ఆన్లైన్ కోటా విడుదల తేదీల షెడ్యూల్‌ను తితిదే(TTD) అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.
ఆర్జిత సేవలు.. లక్కీ డిప్ వివరాలు:
ఈ నెల 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి కీలక సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. భక్తులు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదవుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందినవారు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాలి. ఇక కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, పుష్పయాగం, వర్చువల్ సేవా టికెట్లు ఈ నెల 22న విడుదల కానున్నాయి.
దర్శన టోకెన్లు.. గదుల కేటాయింపు:
ఈ నెల 23న ఉదయం అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాలతో పాటు మధ్యాహ్నం దివ్యాంగులు, వృద్ధుల ఉచిత దర్శన టోకెన్లు అందుబాటులోకి వస్తాయి. భక్తులు ఎంతగానో ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, అద్దె గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. భక్తులు అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే స్పష్టం చేసింది. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు తితిదే బోర్డు ఆహ్వాన పత్రికను అందజేసింది.
